జీ7 సదస్సులో భారతీయ నావికుల మృతిని ప్రస్తావించిన ప్రధాని

ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరుగుతున్న జీ7 సదస్సులో భారతీయ నావికుల భద్రత, పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఒమన్ తీరానికి సమీపంలో భారతీయులు ఉన్న వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందిన నేపథ్యంలో ఈ అంశాన్ని ఆయన అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించారు.

ఒమన్ తీర ప్రాంతంలో ఉన్న నౌకపై అమెరికా దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడుల కారణంగా డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేష్ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై జరుగుతున్న క్షిపణి దాడుల వల్ల భారతీయులు ప్రాణాలు కోల్పోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలోనే మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పటంలో సాధించిన పురోగతిని మేము స్వాగతిస్తున్నాము. ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఘర్షణ ఆ ప్రాంతంలోని మా మిత్రదేశాలలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించింది. ఒమన్ తీర ప్రాంతంలో నౌకపై జరిగిన దాడిలో పలువురు భారతీయ పౌరులు తమ ప్రాణాలను కోల్పోయారు. ప్రపంచ సముద్ర వాణిజ్యం ద్వారా దేశాలకు వారధులుగా నిలిచే నావికుల భద్రత మన బాధ్యత. సముద్ర మార్గాలు సురక్షితంగా ఉండేలా, ఎలాంటి భయాందోళనలు లేకుండా నావికులు విధులు నిర్వహించుకునేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జీ7 సదస్సు వేదికగా మోదీ, ట్రంప్ దాదాపు 16 నెలల తర్వాత ప్రత్యక్షంగా కలుసుకున్నారు. ఇద్దరూ ఆత్మీయంగా పలకరించుకుని, కొద్దిసేపు మాట్లాడుకున్నారు. సదస్సు ప్రధాన సమావేశంలో ఈ ఇద్దరు నేతలు పక్కపక్కనే కూర్చోవడం గమనార్హం.

బుధవారం మోదీ, ట్రంప్ ద్వైపాక్షిక సమావేశం కానున్నారు. ఈ భేటీలో భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, భద్రతా అంశాలు, ప్రాంతీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, సముద్ర మార్గాల భద్రత, అంతర్జాతీయ వాణిజ్య నౌకల రక్షణ వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది.

జీ7 సదస్సు నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భద్రతా సవాళ్లు, వాతావరణ మార్పు వంటి విభిన్న అంశాలపై సభ్య దేశాలు చర్చలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో భారతీయ నావికుల మృతి, సముద్ర భద్రత అంశాలను మోదీ ముందుకు తీసుకురావడం అంతర్జాతీయ సమాజ దృష్టిని ఆకర్షించింది.