రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్:
ఇరాన్‌పై విరుచుకుపడిన అమెరికా సెంట్రల్ కమాండ్
తగిన బుద్ది చెబుతాం..: ఇరాన్
ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇరాన్‌పై అగ్రరాజ్యం మరోసారి యుద్ధానికి దిగింది. ఇరాన్ తీరప్రాంత రాడార్ స్థావరాలతో పాటు ఇరానియన్ మిస్సైల్, డ్రోన్ స్టోరేజ్ ఫెసిటిలీస్‌పై యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) దాడులు చేసింది. గురువారం హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న సింగపూర్ వాణిజ్య నౌకపై ఇరాన్ చేసిన దాడికి ప్రతీకారంగా తాము ఈ దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం తర్వాత యూఎస్ డైరెక్ట్ మిలిటరీ అటాక్ ఇదే కావడం గమనార్హం.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిన్న శుక్రవారం సింగపూర్ షిప్‌పై ఇరాన్ దాడిని ఖండించిన కాసేపటికే ఈ అటాక్ జరిగింది. యూఎస్ దాడులతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ తమపై ప్రతీకార దాడులకు పాల్పడవచ్చని గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు క్రూడాయిల్ ఉత్పత్తి, సరఫరా పరిస్థితి మళ్లీ మొదటికొచ్చే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హోర్ముజ్‌పై ఇరుదేశాల ఆధిపత్య పోరుతో ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టే పరిస్థితి కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు. కాగా, ఈ దాడులపై ఎక్స్ వేదికగా యూఎస్ సెంట్రల్ కమాండ్ స్పందించింది.
యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ పోస్టు..
'జూన్ 25న ఒమన్ తీరం వెంబడి హోర్ముజ్ జలసంధి ద్వారా వెళ్తున్న సింగపూర్‌కు చెందిన సరకు రవాణా నౌక M/V ఎవర్ లవ్లీపై ఇరాన్ వన్-వే అటాక్ డ్రోన్‌తో దాడి చేసింది. వాణిజ్య నౌకపై ఇరాన్ దళాలు జరిపిన ఈ అకారణ దాడి.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘించింది. ఇరాన్ ప్రమాదకరమైన ఈ చర్య అంతర్జాతీయ వాణిజ్య కారిడార్ ద్వారా నౌకాయాన స్వేచ్ఛను దెబ్బతీశాయి. దీంతో జూన్ 26న ఇరాన్‌పై యూఎస్ సెంట్రల్ కమాండ్ దళాలు దాడులకు దిగాయి. జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలకు సురక్షిత మార్గం కోసం మద్దతు అందిస్తూనే ఉంటాం. ఇరాన్‌తో కుదిరిన ఒప్పందంలోని అన్ని అంశాలకు కట్టుబడి ఉన్నాం' అని పేర్కొంది.
ఒప్పందాన్ని ఉల్లంఘించడమే..: ఇరాన్
శాంతి చర్చల మధ్య సైనిక దాడులు చేయడం అంటే ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అమెరికాపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాల్సిన సమయంలో దాడులకు పాల్పడటం శాంతి ఒప్పంద స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని పేర్కొంది. తమ సార్వభౌమాధికారంపై జరిగే ఏ దాడినీ ఉపేక్షించబోమని, ఈ చర్యకు తగిన సమాధానం చెబుతామని హెచ్చరించింది.
ఇటీవల హోర్ముజ్ జలసంధి సమీపంలో వాణిజ్య నౌకపై ఇరాన్‌కు చెందిన డ్రోన్, దాడి చేసినట్టు అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్‌లోని క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీర రాడార్ వ్యవస్థలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. ఈ చర్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. అమెరికా చర్యలను ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. శాంతి చర్చలు కొనసాగుతున్న సమయంలో ఇలాంటి దాడులు చేయడం అమెరికా నిజమైన ఉద్దేశాలను బయటపెడుతోందని వ్యాఖ్యానించింది.
ఒప్పంద ఉల్లంఘన అమెరికాకే నష్టం కలిగిస్తుందని ఇరాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. హోర్ముజ్ జలసంధి నుంచి ప్రయాణించే నౌకలు ఇకపై తమ నిబంధనలనే పాటించాలని స్పష్టం చేసింది. కాగా, హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడులు చేసి, ముందుగా ఇరానే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికా చేపట్టిన సైనిక చర్యలు ప్రతిస్పందన మాత్రమేనని స్పష్టం చేశారు.







