రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
అన్నామలై కొత్త పార్టీ ..
వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధం
ప్రకటించిన మాజీ బీజేపీ నేత
చెన్నై : మాజీ ఐపీఎస్ అధికారి కే. అన్నామలై కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తన కొత్త పార్టీ పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. తమిళనాడులో కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.
భారతీయుడిగా, తమిళుడిగా గర్విస్తున్నానని, తన ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగుతానని అన్నామలై వెల్లడించారు. తమిళనాడు అభివృద్ధినే తనకు ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్నారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడిన అన్నామలై, మార్పు కోసం భారతీయ జనతా పార్టీలో చేరినట్లు గుర్తుచేశారు. తన రాజీనామాను ఆమోదించినందుకు బీజేపీ హైకమాండ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. పార్టీకి రాజీనామా చేసే విషయాన్ని ముందుగానే తెలియజేశానని వ్యాఖ్యానించారు.
తమిళనాడులో బీజేపీ ఒంటిరిగా పోటీ చేయాలని ఆశించా. 18 నెలలుగా బీజేపీతో విభేదాలు ఉన్నాయి. బీజేపీకి నేను భారంగా ఉండాలనుకోవడం లేదు. అందుకే బీజేపీకి రాజీనామా చేశా. 2025 డిసెంబర్ నెలలోనే అధిష్ఠానానికి రాజీనామా గురించి చెప్పా. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు పార్టీలో ఉన్నా” అని అన్నామలై తెలిపారు. తమిళనాడులో కొత్త పార్టీ అవసరంపై స్పందిస్తూ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమని అన్నామలై అభిప్రాయపడ్డారు.
ఈ సమయంలో తమిళనాడుకు కొత్త పార్టీ అవసరమా అని అడిగితే.. కచ్చితంగా అవసరమే. ఓ షాపునకు వెళ్లి టూత్‌పేస్టో, బియ్యమో, కందిపప్పో కొంటున్నపుడు పది షాపులు తిరుగుతాము. రేటు, నాణ్యత చెక్ చేసి కొంటాం. ఎందుకంటే అవి మన శరీరంలోకి పోయేవి. ఇప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నా కూడా పార్టీ నాయకుడు ఎలాంటి వాడో ప్రజలు చూస్తారు. పక్కంటి వాళ్లను చూసినట్లే ప్రజలు మమ్మల్ని చూడబోతున్నారు. దూరం నుంచి ప్రజలకు అభివాదం చేసే రాజకీయాలకు మేము దూరం. కల్ట్ పాలిటిక్స్ నుంచి బయటకు రావాలి. రాజకీయాలను మారుస్తాం అంటున్నారు.. మళ్లీ అదే కల్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. కామన్ మ్యాన్ పాలిటిక్స్ ముందుకు తీసుకురావాలనుకుంటున్నా. కేవలం ముఖ్యమంత్రి కారణంగా మార్పు సాధ్యం కాదు. సర్పంచ్ దగ్గరి నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ నిబద్ధత కలిగిన వాళ్లు ఉంటేనే మార్పు సాధ్యం అవుతుంది” అని అన్నామలై అన్నారు. అన్నామలై కొత్త పార్టీ పేరు, నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉన్నప్పటికీ, వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.







