రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
బీజేపీకి తమిళ నేత అన్నామలై రాజీనామా
సొంత పార్టీ దిశగా అడుగులు?
చెన్నై; తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో బీజేపీకి కీలక నేతగా ఎదిగిన మాజీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన నిర్ణయం తమిళ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సొంత రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, అన్నామలై తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ అధికారికంగా దీనిపై ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అన్నామలైకు పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ చేసినప్పటికీ, ఆయన దానిని తిరస్కరించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై వివిధ రకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా, ఆయన త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
మంగళవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అన్నామలై భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ భేటీకి సంబంధించి కూడా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అయితే ఈ సమావేశం తర్వాతే అన్నామలై తదుపరి అడుగులపై స్పష్టత వచ్చే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తమిళనాడు బీజేపీలో ఇటీవల నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం చేపట్టిన కార్యక్రమాల్లో అన్నామలై పాత్ర, ఆయన రాజీనామా నేపథ్యంలో మళ్లీ చర్చకు వచ్చాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వంలో మార్పులు, స్థానిక మిత్రపక్షాలతో సంబంధాలు వంటి అంశాలు కూడా ఈ పరిణామంతో ముడిపడి ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్నామలై త్వరలోనే సొంత రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది.







