రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
సీఎం సువేందును కట్టడి చేయండి..
: భారత్‌కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని కట్టడి చేయాలని, అయన చేస్తున్న వ్యాఖ్యలు, నిర్ణయాలు బంగ్లాదేశ్ కు ఇబ్బందికరంగా ఉన్నాయని ఆ దేశ అధికార పార్టీ బీఎన్పీ ఎంపీ గులాం మహహ్మద్ సిరాజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం సువేందు అధికారి నిర్ణయాలు బంగ్లాలో రాజకీయ చర్చలకు దారితీశాయి.
ఇన్నాళ్లుగా బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్‌కు వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమ చొరబాటుదారులు తిరిగి తమ దేశానికి వెళ్తున్నారని భారత రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ పౌరులపై, అక్రమ వలసలపై సువేందు తరచూ హెచ్చరికలతో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నారని బంగ్లాదేశ్ నేతలు ఆరోపిస్తున్నారు.
బంగ్లాదేశ్ పార్లమెంట్‌లో ప్రత్యేకంగా జరిగిన చర్చ సందర్భంగా గులాం మహహ్మద్ సిరాజ్ మాట్లాడుతూ.. సువేందు అధికారి వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉన్న సున్నిత సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆయనను నియంత్రించాల్సిన అవసరం ఉందని భారత ప్రభుత్వాన్ని కోరారు.
“నేను స్పీకర్ ద్వారా భారత ప్రభుత్వానికి చెప్పాల్సింది ఒకటే. పశ్చిమ బెంగాల్ నాయకుడు సువేందు బాబును అడ్డుకోవాలి. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు భారత్–బంగ్లా స్నేహానికి అనుకూలంగా లేవు”
అని గులాం మహహ్మద్ సిరాజ్ పార్లమెంట్‌లో పేర్కొన్నారు.
చర్చలో భాగంగా ఆయన మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయ భవిష్యత్తుపై కూడా స్పందించారు. ప్రస్తుత బంగ్లాదేశ్ రాజకీయ పరిణామాల్లో షేక్ హసీనా పాత్ర లేదని, ఆమె ఇప్పుడు రాజకీయంగా అంశం కాదని తెలిపారు. షేక్ హసీనా అధ్యాయం ముగిసిందని, ఆమె గురించి తమకు ఎలాంటి ఆందోళన లేదని స్పష్టం చేశారు.
భారత్–బంగ్లాదేశ్ సంబంధాల ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ, రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని గులాం మహహ్మద్ సిరాజ్ సూచించారు. ఇరుదేశాలు భౌగోళికంగా, చారిత్రకంగా విడదీయరాని పొరుగుదేశాలుగా ఉన్నాయని గుర్తుచేశారు.
దేశాల మధ్య సంబంధాలను వ్యక్తిగత బంధాలతో పోలుస్తూ, ఇద్దరు స్నేహితులు, భార్యభర్తలు విడిపోవచ్చని, అయితే ఇరుగుపొరుగు దేశాల మధ్య ఉన్న సంబంధాలకు విడాకులు ఉండవని ఆయన వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్–భారత్ ఎప్పటికీ పొరుగుదేశాలుగానే కొనసాగుతాయని, ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల వ్యాఖ్యలు బాధ్యతాయుతంగా ఉండాలని సూచించినట్లు పార్లమెంట్ చర్చలో పాల్గొన్న సభ్యులు పేర్కొన్నారు.







