సైబర్ నేరగాళ్లు సాగించే 'డిజిటల్ అరెస్ట్' మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దేశవ్యాప్తంగా ఒక భారీ ఆపరేషన్ చేపట్టింది. 'ఆపరేషన్ చక్ర-VI' పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 16 రాష్ట్రాల్లోని 80కి పైగా ప్రాంతాల్లో సీబీఐ అధికారులుదాడులు నిర్వహించారు. ఈ దాడుల అనంతరం కోల్‌కతాలో ఒకర్ని,  చెన్నైలో మరొకరిని అధికారులు అరెస్ట్ చేశారు.

సుదీర్ఘ ఆపరేషన్‌లో భాగంగా సీబీఐ ప్రత్యేక బృందాలు  గురువారం దేశంలోని 16 రాష్ట్రాలలో 80కి పైగా ప్రదేశాలలో సమన్వయంతో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి. తెలంగా, ఆంధ్రప్రదేశ్, పంజాబ్‌, ఢిల్లీ మహారాష్ట్ర, హర్యానా, తమిళనాడు ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్, అస్సాం, పశ్చిమ బెంగాల్‌, మణిపూర్‌, కర్ణాటక, ఒడిశా తదితర ప్రాంతాల్లో ఈ దాడులు చేపట్టింది. నకిలీ (షెల్) కంపెనీలను ఏర్పాటు చేసి, సైబర్ నేరాల సొమ్మును మళ్లించడానికి వీలుగా 'మ్యూల్ బ్యాంక్ ఖాతాలను' (మరోకరి పేరిట తెరిచే ఖాతాలు) నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను చెన్నై, కోల్‌కతాలలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు 200 కంటే ఎక్కువ డిజిటల్ అరెస్ట్ స్కామ్ కేసులలో భాగస్వామ్యమై, దేశవ్యాప్తంగా విస్తరించిన ఒక పెద్ద నేరపూరిత నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించడమే ఈ ఆపరేషన్  ముఖ్య ఉద్దేశం.