నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రారంభించిన ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం. ఆ ఉద్యమం తర్వాత విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సీజేపీ మరో దశకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నీట్ సంబంధిత ఘటనల్లో విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌పై కొత్త ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తోంది.

ఈ నేపథ్యంలో సీజేపీ నాయకులు ఢిల్లీలో రైతు ఉద్యమ నాయకుడు రాకేష్ టికాయత్‌ను కలిసి చర్చలు జరిపారు. రైతులు–విద్యార్థులు–యువత కలిసి ఉమ్మడి వేదికపై పోరాటం చేయాలన్న ఆలోచనతో ఈ సమావేశం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా, ఇతర కాక్రోచ్ ప్రతినిధులు, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకులతో కలిసి రాకేష్ టికాయత్‌తో సమావేశమయ్యారు. భవిష్యత్తులో రైతులు, యువత కలిసి చేపట్టబోయే వ్యూహాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు తెలియజేశారు.

‘‘దేశంలోని రైతులు, విద్యార్థులు, యువత కలిసి నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాలని ఆశిస్తున్నాం’’

అని ఈ సమావేశం అనంతరం అశుతోష్ రాంకా వ్యాఖ్యానించారు.

రాంకా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇకపై విద్యా సమస్యలతో పాటు రైతులు, యువత సమస్యలను కూడా తమ ఉద్యమంలో భాగం చేయాలని సీజేపీ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి.

నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యార్థుల నిరసన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని సీజేపీ ఆరోపిస్తోంది. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యార్థులపై కేసులు నమోదయ్యాయని పార్టీ నేతలు పేర్కొన్నారు. విద్యార్థులపై నమోదైన కేసులను విత్ డ్రా చేయాలని రాకేష్ టికాయత్ మద్దతు కోరినట్లు సీజేపీ తెలిపింది.

ప్రభుత్వం ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోకపోతే రైతు సంఘాలు, యువజన సంఘాలతో కలిసి దేశవ్యాప్త ఉద్యమం చేపట్టే అవకాశముందని సీజేపీ హెచ్చరిస్తోంది. నీట్ పేపర్ లీక్ వివాదం నుంచి ప్రారంభమైన ఈ పోరాటం, ఇప్పుడు విద్యా వ్యవస్థ, రైతు సమస్యలు, యువత సమస్యలను కలిపిన విస్తృత రాజకీయ–సామాజిక ఉద్యమంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.