రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
మమతా బెనర్జీకి వరుస దెబ్బలు.. రాజ్యసభకు ప్రకాశ్ చిక్ బరైక్ రాజీనామా
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ సీనియర్ నేతల రాజీనామాలతో టీఎంసీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రాజ్యసభ సభ్యుల రాజీనామాలు, లోకసభ ఎంపీల తిరుగుబాటుతో పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నార్థక చిహ్నం నెలకొంది.
మూడు రోజుల క్రితం టీఎంసీ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితులుగా, నమ్మిన బంటుగా పేరుపొందారు. ఆయన వైదొలగడం పార్టీకి మొదటి పెద్ద దెబ్బగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
అదే క్రమంలో బుధవారం మరో టీఎంసీ రాజ్యసభ సభ్యురాలు సుష్మితా దేవ్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఆమె త్వరలో భారతీయ జనతా పార్టీ లో చేరతారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
తాజాగా గురువారం ప్రకాష్ చిక్ బారైక్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వరుసగా మూడో రాజీనామాతో టీఎంసీకి రాజ్యసభలో గట్టి దెబ్బ తగిలింది. ప్రకాశ్ రాజీనామాతో ఆ సభలో టీఎంసీ ఎంపీల బలం 10కి పడిపోయింది. మరికొంతమంది కూడా రాజీనామా చేసే అవకాశమున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇది ఆరంభం మాత్రమేనని, వచ్చే వారం మరో కొంతమంది టీఎంసీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే టీఎంసీకి చెందిన 19 మంది లోకసభ ఎంపీలు తిరుగుబాటు చేసి వేరు గుంపు ఏర్పాటు చేశారు. ఈ బృందానికి టీఎంసీ సీనియర్ ఎంపీ కాకోలీ ఘోష్ నేతృత్వం వహిస్తున్నారు.
మమతా బెనర్జీకి అత్యంత విధేయులుగా పేరున్న శత్రుఘ్న సిన్హా, యూసుఫ్ పఠాన్, సయాని ఘోష్ కూడా తిరుగుబాటు బృందంతో చేతులు కలపడం పార్టీకి మరొక పెద్ద ఎదురుదెబ్బగా మారింది. దాదాపు 64 మంది ఎమ్మెల్యేలు రెబల్స్‌గా మారినట్టు సమాచారం. దీంతో పార్టీ అంతర్గత సంక్షోభం మరింత తీవ్రమైంది.
ఈ పరిణామాల నేపథ్యంలో మమతా బెనర్జీ దిక్కుతోచని స్థితిలో ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. టీఎంసీపై నెలకొన్న తీవ్ర సంక్షోభం దృష్ట్యా పార్టీని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో విలీనం చేయాలని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనపై స్పందించేందుకు కొంత సమయం కావాలని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కోరినట్టు తెలిసింది.







