రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
పార్లమెంటులో స్పెషల్ మెజారిటీ లక్ష్యంగా ఎన్‌డీఏ కసరత్తులు
న్యూఢిల్లీ: పార్లమెంటులో స్పెషల్ మెజారిటీ సాధించేందుకు అధికార ఎన్‌డీఏ కూటమి సక్రియంగా ప్రయత్నాలు ప్రారంభించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా టీఎంసీ ఎంపీల తిరుగుబాటు అవకాశాల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గ పునర్విభజన అంశాలు మరోసారి చర్చకు వస్తున్నాయి.
ఇటీవల లోక్‌సభలో అధికార పార్టీ ప్రవేశపెట్టిన బిల్లు స్పెషల్ మెజారిటీ దక్కకపోవడంతో విఫలమైన విషయం తెలిసిందే. ఏప్రిల్‌లో ఈ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో మొత్తం 528 మంది ఎంపీలు పాల్గొన్నారు. దీంతో స్పెషల్ మెజారిటీకి అవసరమైన మేజిక్ ఫిగర్ 352 ఓట్లుగా నిర్ణయించబడింది. అయితే బిల్లుకు అనుకూలంగా 298 మంది ఎంపీలు మాత్రమే ఓటు వేయగా, 230 మంది ఎంపీలు వ్యతిరేకించారు. అనుకూల ఓట్లు 352 మార్కు దాటకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేదు.
స్పెషల్ మెజారిటీ సాధించాలంటే ఓటింగ్‌లో పాల్గొనే సభ్యులలో మూడింట రెండు వంతుల మంది బిల్లుకు మద్దతు ఇవ్వాలి. అదే సమయంలో, ఆ అనుకూల సభ్యుల సంఖ్య లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్యలో (543) సగానికి పైగా ఉండాలి. ఈ రెండు షరతులు నెరవేరినప్పుడే దానిని స్పెషల్ మెజారిటీగా పరిగణిస్తారు.
పార్లమెంటు వేదికగా తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక తప్పదన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్‌డీఏ సంఖ్యాబలం స్పెషల్ మెజారిటీకి మరింత చేరువ కావచ్చన్న విశ్లేషణలు జాతీయ మీడియాలో వినిపిస్తున్నాయి. టీఎంసీ ఎంపీ కాకోలీ ఘోష్ దస్తీదార్ తనకు 20 మంది ఎంపీల మద్దతు ఉందని వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి. చట్టప్రకారం టీఎంసీలో అధికారిక చీలికకు ఆయనకు మరో ఎంపీ మద్దతు అవసరం. ఆ తరువాత ఈ బృందం లోక్‌సభలో ఎన్‌డీఏకు మద్దతు ప్రకటించే అవకాశం ఉందని కథనాలు సూచిస్తున్నాయి.
ప్రస్తుతం లోక్‌సభలో ఎన్‌డీఏకు 293 మంది ఎంపీలు ఉన్నారు. 20 మంది టీఎంసీ ఎంపీల మద్దతు లభిస్తే ఈ సంఖ్య 313కు చేరుతుంది. అదనంగా 22 మంది డీఎంకే ఎంపీల మద్దతు కూడగలిగితే ఎన్‌డీఏ బలం 335కు పెరుగుతుంది. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేనకు చెందిన 9 మంది ఎంపీల మద్దతు కోసం కూడా ఎన్‌డీఏ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు సమాచారం. వీరిలో కొందరు ఎన్‌డీఏ వైపు మొగ్గు చూపినా సంఖ్య 341కు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మిగిలిన అవసరమైన ఓట్లను చిన్న పార్టీలు, స్వతంత్ర ఎంపీల మద్దతుతో భర్తీ చేయాలనే ఆలోచన ఎన్‌డీఏలో ఉన్నట్టు తెలుస్తోంది.
రాజ్యసభలో కూడా మూడింట రెండు వంతుల స్పెషల్ మెజారిటీ (164) లక్ష్యంగా ఎన్‌డీఏ వ్యూహరచన చేస్తోందని వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే టీఎంసీ రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన మళ్లీ ఎన్నికై ఈసారి BJPకు మద్దతు ఇవ్వవచ్చన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మిగిలిన 12 మంది టీఎంసీ రాజ్యసభ సభ్యులు కూడా ఇదే ఫార్ములాను అనుసరించే అవకాశముందని జాతీయ మీడియా పేర్కొంటోంది.
అదేవిధంగా 8 మంది డీఎంకే రాజ్యసభ సభ్యులు కూడా కొన్ని షరతులపై ఎన్‌డీఏ ప్రవేశపెట్టే బిల్లుకు మద్దతు ఇవ్వవచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి. ఇతర చిన్న పార్టీల మద్దతు కూడగడితే పెద్దల సభలో కూడా ఎన్‌డీఏకు పైచేయి లభించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.







