రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్: నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. శనివారం ఆయన తన రాజీనామా లేఖను ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పంపినట్లు వెల్లడించారు. నీట్ అవకతవకలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలతో పాటు యువత, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ విషయాన్ని ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. తన రాజీనామా లేఖలో విద్యా రంగంలో తన సేవల గురించి ప్రస్తావించారు. గత నాలుగు దశాబ్దాలుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్కరణల కోసం పనిచేస్తున్నామని ఆయన లేఖలో పేర్కొన్నారు. దేశ యువత ఆకాంక్షలను నెరవేర్చడం తన నైతిక బాధ్యతగా భావిస్తున్నట్లు వివరించారు.
2026 మే 3న నిర్వహించిన NEET-UG పరీక్షలో అవకతవకలు వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే CBI విచారణకు ఆదేశించిందని ప్రధాన్ గుర్తుచేశారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించడంతో పాటు, వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో NEET-UG నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
20 లక్షల మందికి పైగా విద్యార్థుల కోసం తిరిగి పరీక్షను విజయవంతంగా నిర్వహించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జూన్ 21న తిరిగి నిర్వహించిన పరీక్ష విజయవంతంగా పూర్తయిందని చెప్పారు.
నీట్ వివాదం మొదటి రోజు నుంచే తాను బాధ్యత తీసుకున్నానని, ఎగ్జామ్ మాఫియా కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోకుండా కృషి చేశానని ప్రధాన్ లేఖలో పేర్కొన్నారు. జూలై 16న ప్రకటించిన ఫలితాల్లో పేద, వెనకబడిన వర్గాలకు చెందిన అనేక మంది విద్యార్థులు విజయాన్ని సాధించడం సంతోషకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు విద్యార్థులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం తనను బాధించిందని ప్రధాన్ తెలిపారు. గత పది రోజులుగా జరిగిన పరిణామాలు కలచివేశాయని, ఇది తన వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదని స్పష్టం చేశారు.
జంతర్ మంతర్‌తో పాటు దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, దేశవ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని ఉపయోగించుకోకుండా చూడడం, జాతీయ ఐక్యతను కాపాడడం, విద్యార్థుల భవిష్యత్తు న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా నిరోధించడం, వారు చదువులపై దృష్టి సారించేలా చేయడమే లక్ష్యంగా ప్రధాన మంత్రికి రాజీనామా లేఖ సమర్పించినట్లు ప్రధాన్ వివరించారు.
తనపై నమ్మకం ఉంచిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి, కేంద్ర మంత్రివర్గ సహచరులకు, విద్యాశాఖ అధికారులకు ధర్మేంద్ర ప్రధాన్ కృతజ్ఞతలు తెలిపారు. దేశ సేవే తన జీవిత లక్ష్యమని, భవిష్యత్తులోనూ ఒడిశా ప్రజలు, దేశ యువత కోసం సేవ కొనసాగిస్తానని ఆయన లేఖలో పేర్కొన్నారు.







