ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్?

చీలిక దిశగా శివసేన (UBT)

ఢిల్లీలో స్పీకర్‌ను కలవనున్న ఎంపీలు

మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. శివసేన (UBT)కు చెందిన పలువురు లోక్‌సభ సభ్యులు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో కీలక సమావేశాలు జరగనున్నాయని సమాచారం. శివసేన (UBT) ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలిసే ముందు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే కుమారుడు అయిన శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నివాసంలో బుధవారం ఈ భేటీ జరగనుందని సమాచారం. ఈ సమావేశం అనంతరం శివసేన (UBT)కు చెందిన కొందరు ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి, తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది.

మొత్తం తొమ్మిది మంది శివసేన (UBT) లోక్‌సభ సభ్యుల్లో ఆరుగురు ఎంపీలు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని అధికార శివసేనతో సంప్రదింపుల్లో ఉన్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. ఆరుగురు ఎంపీలుగా ప్రచారంలో ఉన్న పేర్లు ఇవి:

1. సంజయ్ దినా పాటిల్ (ముంబై నార్త్ ఈస్ట్)
2. సంజయ్ దేశ్‌ముఖ్ (యావత్మాల్)
3. నాగేష్ పాటిల్ అస్తికార్ (హింగోలి)
4. ఓంరాజే నింబాల్కర్ (ధారాశివ్)
5. భావూసాహెబ్ వాక్‌చౌరే (శిరిడీ)
6. సంజయ్ జాదవ్ (పర్భణీ)

వీరితో పాటు రాజాభౌ వాజే పేరు కూడా ఈ జాబితాలో వినిపిస్తోంది. యాంటీ డిఫెక్షన్ చట్టం ప్రకారం అనర్హత వేటు తప్పించుకోవాలంటే, తొమ్మిది మందిలో కనీసం రెండు మూడవ వంతు అంటే ఆరుగురు ఎంపీలు విడిపోవాల్సి ఉంటుంది. ఈ తిరుగుబాటు ఎంపీలు ముందుగా లోక్‌సభలో ప్రత్యేక పక్షంగా ఏర్పడి, ఆపై జూన్ 19న జరగనున్న Shiv Sena Foundation Day సందర్భంగా అధికారికంగా షిండే వర్గంలో విలీనం కావచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇటీవల ముంబైలో ఉద్ధవ్ ఠాక్రే నివాసం ‘మాతోశ్రీ’లో జరిగిన అత్యవసర సమావేశానికి కేవలం నలుగురు ఎంపీలు మాత్రమే వ్యక్తిగతంగా హాజరుకావడం, మరో ఐదుగురు దూరంగా ఉండటం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ ప్రచారాన్ని శివసేన (UBT) ఫైర్‌బ్రాండ్ నాయకుడు సంజయ్ రౌత్ తీవ్రంగా ఖండించారు. పార్టీలో ఎలాంటి చీలిక లేదని, ఎంపీలంతా ఉద్ధవ్ ఠాక్రే వెంటే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

“కొందరు వ్యక్తిగత, వైద్య కారణాల వల్లే మాతోశ్రీ సమావేశానికి రాలేకపోయారు, కానీ వారంతా వర్చువల్‌గా హాజరయ్యారు. విపక్షాలు మైండ్ గేమ్స్ ఆడుతున్నాయి. వారి ‘ఆపరేషన్ టైగర్’కు కౌంటర్‌గా మేము ‘ఆపరేషన్ వోల్ఫ్’ ప్రారంభిస్తాం”

అని సంజయ్ రౌత్ హెచ్చరించారు.

ఇదిలా ఉండగా, ఎంపీలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా చేజారిపోయే ప్రమాదం ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే అప్రమత్తమయ్యారు. జూన్ 22న సాయంత్రం 4 గంటలకు ముంబై నారిమన్ పాయింట్‌లోని పార్టీ కార్యాలయం ‘శివాలయ’లో శివసేన (UBT) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అత్యవసర సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేశారు.

2022లో శివసేనను చీల్చి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టిన ఏకనాథ్ షిండే, ఇప్పుడు లోక్‌సభ వేదికగా రెండోసారి వ్యూహాత్మక దెబ్బ కొట్టబోతున్నారా అన్న ప్రశ్నకు సమాధానం రానున్న 48 గంటల్లో వెలువడనుంది.