అన్నామలై–రజినీకాంత్ కొత్త పార్టీ

వేడెక్కిన తమిళ రాజకీయాలు

తమిళనాడు రాజకీయాల్లో ఇటీవల పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఎన్నాళ్లుగానో ప్రచారం సాగి, చివరి దశలో ఆయన వెనక్కి తగ్గడం, కమల్ హాసన్ DMKకు మద్దతు ఇవ్వడం, విజయ్ కొత్త పార్టీ ఏర్పాటు చేసి తక్షణమే ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవడం, ఇక బీజేపీలో కీలక నాయకుడిగా ఎదిగిన అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేయడం వంటి పరిణామాలతో తమిళ రాజకీయ వాతావరణం మరింత రసవత్తరంగా మారింది.

అన్నామలై బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన స్వంతంగా పార్టీ ఏర్పాటు చేస్తారా? లేక మరో పార్టీని ఆశ్రయిస్తారా? అనే చర్చలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఆయన రజినీకాంత్‌తో కలిసి పనిచేస్తారనే వార్తలు కూడా తమిళనాట వినిపిస్తున్నాయి. ఇప్పటికే అన్నామలై, రజినీకాంత్‌ను కలిసినట్లు సమాచారం. ఆయనతో కలిసి రాజకీయంగా ముందుకు సాగేందుకు ఆసక్తి చూపుతున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

తాజాగా అన్నామలై–రజినీకాంత్ కలిసి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారనే వార్త తమిళనాడులో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో రజినీకాంత్ కుటుంబం ఇటీవల చేపట్టిన ఒక కార్యక్రమం మళ్లీ చర్చకు వచ్చింది. మార్చి నెలలో రజినీకాంత్ భార్య లత, తాము నిర్వహించబోయే సేవా కార్యక్రమాల గురించి ప్రకటిస్తూ ‘మక్కల్ మడై’ అనే వేదికను ఆవిష్కరించారు.

ప్రజల సమస్యలు వినడానికి, మహిళలు, పిల్లలు, వెనకబడిన వర్గాల కోసం పోరాటం చేయడానికి ఈ మక్కల్ మడై ముందుంటుంది. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి వినిపించడానికి ఈ మక్కల్ మడై. దీనికి ఎలాంటి రాజకీయ కారణం లేదు.

అప్పటి ఎన్నికల హడావిడిలో ‘మక్కల్ మడై’పై పెద్దగా దృష్టి పడలేదు. అయితే ఇప్పుడు అదే వేదిక పార్టీగా మారే అవకాశాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో రజినీకాంత్ ‘రజిని మక్కల్ మడై’ పేరుతో పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ఆ సమయంలో రాజకీయ ప్రవేశం చివరి నిమిషంలో ఆగిపోయినా, అదే పేరుతో ఇప్పుడు స్వచ్ఛంద సంస్థ రూపంలో వేదికను కొనసాగిస్తున్నారు.

ఇప్పుడు ఈ ‘మక్కల్ మడై’నే రాజకీయ పార్టీగా మార్చి, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయించే యోచనలో రజినీకాంత్–అన్నామలై ఉన్నారని తమిళ మీడియా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అన్నామలై బీజేపీకి రాజీనామా చేసినప్పటికీ, ఆయన సిద్ధాంతాలు ఆ పార్టీకి అనుకూలంగానే ఉంటాయని, రజినీకాంత్ కూడా బీజేపీకి మద్దతుదారుడిగానే కొనసాగుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి ‘మక్కల్ మడై’ పేరుతో పార్టీ ఏర్పాటు చేస్తే, అది బీజేపీ కూటమి తరఫునే ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందని తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే విజయ్ ఒక్కసారిగా ఎదిగి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్న నేపథ్యంలో, ఇప్పుడు అన్నామలై–రజినీకాంత్ నిజంగానే కొత్త పార్టీ పెడతారా? లేక ఇప్పటికే ఉన్న ఏదైనా శక్తికి మద్దతు ఇస్తారా? ‘మక్కల్ మడై’ భవిష్యత్ దిశ ఏంటి? అనే ప్రశ్నలు తమిళనాట రాజకీయ చర్చలకు కేంద్రబిందువుగా మారాయి.