రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్: అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టనున్న ప్రజా చైతన్య కార్యక్రమాలు, ఇంటింటి ప్రచారంపై ఆయన నేతలకు కీలక సూచనలు చేశారు. రేపటి నుంచి 45 రోజుల పాటు Telugu Desam Party ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు గురించి ప్రజలకు సమగ్రంగా వివరించాలని సీఎం నేతలకు సూచించారు. ప్రతి ఇంటిని చేరుకుని కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ఆయన ఉద్ఘాటించారు.
2024 ఎన్నికల ఫలితాలతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కూడా పార్టీ నాయకులు జాగ్రత్తగా గమనించాలని సీఎం చంద్రబాబు నేతలకు సూచించారు. ప్రతిపక్ష పార్టీ అనుసరిస్తున్న విధానాలు, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ప్రజల ముందు ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రజలతో నిరంతరం మమేకమైతే ప్రతిపక్షాల కుట్రలను సమర్థంగా తిప్పికొట్టవచ్చని, ప్రతి నాయకుడు ప్రజల్లో ఉండడాన్ని తన బాధ్యతగా భావించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇంటింటి ప్రచారం ద్వారా కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలపర్చేలా కార్యక్రమాలను రూపకల్పన చేయాలని ఆయన సూచించారు.







