జగన్ ది రాక్షస మనస్తత్వం..

జల వనరుల శాఖ మంత్రి నిమ్మల ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాక్షస మనస్తత్వం జగన్ రెడ్డిదని ధ్వజమెత్తారు. కరువు కాటాకాలతో రాష్ట్రం అల్లాడిపోవాలని ఆలోచన ఆయనదని విమర్శించారు. బుధవారం పవిత్ర సంగమం వద్ద 11 గంటలకు జలహారతి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు, మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడారు. రైతు ద్రోహి జగన్ అని.. అలాంటి వ్యక్తి పార్టీ అధ్యక్షుడిగా ఉండే అర్హత కూడా లేదని ఎద్దేవా చేశారు. ఎల్‌నీన్ కారణంగా ఏపీలో ఎక్కడా ఒక చుక్క నీరు కూడా లేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల, ప్రాజెక్టుల్లో నీళ్లు లేని పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు ముందుచూపుతోనే ఈరోజు రైతాంగానికి పట్టిసీమ ప్రాణం పోస్తుందని ఉద్ఘాటించారు. కృష్ణా డెల్టాకు, రాయలసీమకు పట్టిసీమతో భద్రత కల్పించారని తెలిపారు. పోలవరం పూర్తి అయ్యేలోపు పట్టిసీమ ద్వారా నీళ్లు పంపిస్తుంటే, పట్టిసీమను ఒట్టు సీమని మాట్లాడిన జగన్ కృష్ణానది ఒడ్డుకొచ్చి ఈరోజు సమాధానం చెప్పాలని మంత్రి నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు.

పట్టిసీమ రైతాంగానికి భరోసా..

రూ.1300 కోట్లతో నిర్మించిన పట్టిసీమ నేడు రూ.50 వేల కోట్ల ఆదాయం సృష్టించిందని మంత్రి నిమ్మల తెలిపారు. పట్టిసీమను వట్టిసీమ అన్న గొడ్డలిపార్టీ నాయకుడు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సమాధానం చెబుతారని ప్రశ్నించారు.ఇప్పటివరకు పట్టిసీమ ద్వారా 445కు పైగా టీఎంసీలను కృష్ణా డెల్టాకు తరలించామని తెలిపారు. ఈసీజన్‌లో ఇప్పటికే 3 టీఎంసీలకు పైగా నీటిని కృష్ణానదిలోకి తరలించామని వెల్లడించారు. తీవ్ర కరువు పరిస్థితుల్లో 13.08 లక్షల ఆయకట్టు ఉన్న కృష్ణాడెల్టాకు నేడు పట్టిసీమ నీళ్లు ఊపిరిపోస్తున్నాయని తెలిపారు. పట్టిసీమ కేవలం కృష్ణాడెల్టాకు మాత్రమే కాదని రాయలసీమకు సైతం నీటి భద్రత కల్పించిన పథకమని వ్యాఖ్యానించారు. దేశంలోనే తొలి విజయవంతమైన నదుల అనుసంధాన పథకంగా ఈ పథకం గుర్తింపు పొందిందని వివరించారు. పట్టిసీమ కేవలం ఒక ఎత్తిపోతల పథకం కాదని, మన రైతాంగానికి ఓ భరోసా అని ఉద్ఘాటించారు.

అందుకే పట్టిసీమ వైపు జగన్ కన్నెత్తి చూడలేదు..

దూరదృష్టి, ముందుచూపు, నిర్మాణాత్మక ఆలోచన కలిగిన నాయకుడు ఉంటే ప్రజలకు ఏవిధంగా మేలు జరుగుతుందో పట్టిసీమే ఉదాహరణ అని మంత్రి నిమ్మల చెప్పుకొచ్చారు. పాలన అనుభవం లేకపోవడం, విధ్వంసపు ఆలోచనలు, ముందుచూపు లేకపోవడం, వల్లే గొడ్డలి పార్టీ నాయకుడు పట్టిసీమ వైపు కన్నెత్తి చూడలేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు సూచనలతో సూపర్ ఎల్ నీనోను సమర్థంగా ఎదుర్కొనేందుకు, ముందస్తు ప్రణాళికలతో ప్రతి నీటి బొట్టునూ వినియోగించుకుంటున్నామని వెల్లడించారు. ఆల్మట్టి నుంచి జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్ వరకు ఖాళీ జలాశయాలతో ఉన్న కృష్ణాకు ఈ పట్టిసీమ నేడు ఉపిరి పోస్తుందని వివరించారు. పట్టిసీమ కట్టి, రూ.1300 కోట్లు గొడ్డలి పార్టీ నాయకుడు నీటి పాలు చేశారని మాట్లాడారని మండిపడ్డారు. కృష్ణా డెల్టా బీడుగా మారి, కరువు కాటకాలతో దుర్భిక్షంగా ఉండాలనేది రాక్షస మనస్తత్వం ఉన్న గొడ్డలి పార్టీ అధినేత కోరిక అని ఎద్దేవా చేశారు.

కేఎల్ రావు‌కు నివాళి అర్పించిన మంత్రి నిమ్మల..

ప్రఖ్యాత ఇంజినీర్ డాక్టర్ కేఎల్ రావు 125వ జయంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద మంత్రి నిమ్మల రామానాయుడు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, కేఎల్ రావు కుమారుడు విజయ్ రావు, ఇరిగేషన్ సలహాదారులు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహ మూర్తి, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడారు. దేశ ఇరిగేషన్ రంగంలో డాక్టర్. కేఎల్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. హీరాకుడ్, శ్రీశైలం, నాగార్జున సాగర్, వంటి అనేక బహుళార్థక సాధక ప్రాజెక్టుల రూపకల్పనలో కేఎల్ రావు ప్రధాన పాత్ర పోషించారని ప్రశంసించారు. దేశంలో 50 ఏళ్ల క్రితమే నదుల అనుంధానాన్ని ప్రతిపాదించిన దార్శనికుడు డాక్టర్ కేఎల్ రావు అని కీర్తించారు. నాడు వాజ్‌పాయ్, నేడు నరేంద్రమోదీ, చంద్రబాబు నదుల అనుసంధానం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని వ్యాఖ్యానించారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను, కృష్ణాజలాలతో అనుసంధానం చేసి, నదుల అనుసంధానానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.

పట్టిసీమను కొంతమంది దుర్మార్గులు హేళన చేశారు: ఎమ్మెల్యే వసంత

కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా 12 లక్షలు ఎకరాలకు గోదావరి జలాలు పంపించడం సీఎం చంద్రబాబు ముందుచూపునకు నిదర్శనమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు. సీఎం మీద గతంలో ఇది పట్టిసీమ కాదని.. వట్టిసీమని కొంతమంది దుర్మార్గులు హేళన చేశారని ధ్వజమెత్తారు. ఈ దుర్మార్గులకి ఇదే కనువిప్పు అని చెప్పుకొచ్చారు. సాగునీరే కాకుండా తాగునీరు కూడా పట్టిసీమ భరోసా కల్పిస్తుందని ఉద్ఘాటించారు. మూడు రాజధానులు కూడా 13 జిల్లాలకు మధ్యలో పెడితే ఈ జగన్ రెడ్డి వచ్చి మూడు రాజధానులంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.