ఆక్వా సిండికేట్‌ను కూకటివేళ్లతో పెకలిస్తా!

వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్

రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని, ఫీడ్ కంపెనీలు, కొనుగోలు సిండికేట్లు, ప్రభుత్వ నిర్లక్ష్యం కలిసి రైతుల జీవితాలను దెబ్బతీశాయని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సీఎం సీట్లో చంద్రబాబు నాయుడు ఉంటే సిండికేట్లకు పండగ, రైతులకు మాత్రం కన్నీళ్లేనని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. భీమవరంలో ఆక్వా రైతులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన, వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆక్వా రైతులకు కల్పించిన రక్షణ, గిట్టుబాటు ధర, రూపాయిన్నర విద్యుత్, APSADA వంటి సంస్కరణలను గుర్తు చేస్తూ, ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కూటమి ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. రైతుల ప్రభుత్వం తిరిగి వచ్చిన వెంటనే APSADAను పూర్తి స్థాయిలో పునరుద్ధరించి, సిండికేట్ వ్యవస్థను అరికట్టి ఆక్వా రంగాన్ని మళ్లీ గాడిలో పెడతామని ఆయన భరోసా ఇచ్చారు. 

 వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏమ‌న్నారంటే..

రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా మా ప్రభుత్వమే ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్ ధరలను సమీక్షిస్తూ, ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువకు రైతులు నష్టపోకుండా ఐదేళ్ల పాటు అండగా నిలిచాం. కరోనా వంటి క్లిష్ట సమయంలో కూడా 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.230 కంటే తక్కువ ధర రాకుండా రైతుల ప్రయోజనాలను కాపాడాం.

ఈరోజు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఉత్పత్తి వ్యయం కిలోకు రూ.275కు పెరిగింది. ఫీడ్ ధరలు పెరుగుతున్నాయి. సీడ్ ధరలు పెరుగుతున్నాయి. కానీ పంట కొనుగోలు ధర మాత్రం రూ.230 దాటడం లేదు. ఒకవైపు ఖర్చులు పెరిగి, మరోవైపు అమ్మకపు ధర పెరగకపోతే రైతు ఎలా బతుకుతాడు? ఈ ప్రశ్నకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

ఆక్వా రైతుల కోసం నిజంగా పనిచేసిన ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. రూపాయిన్నరకే విద్యుత్ అందించిన ఘనత మా ప్రభుత్వానిది. 57 నెలల పాటు రూ.3,306 కోట్ల సబ్సిడీ భరిస్తూ రైతులకు అండగా నిలిచాం. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆక్వా రైతులు యూనిట్‌కు రూ.3.85 చెల్లించాల్సి వచ్చింది.

ఎన్నికలకు నాలుగు నెలల ముందు మాత్రమే రూపాయిన్నర విద్యుత్ గురించి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు, ఆ నాలుగు నెలల సబ్సిడీ కూడా చెల్లించలేదు. ప్రభుత్వం మారిన తర్వాత ఆ రూ.451 కోట్ల భారాన్ని కూడా మా ప్రభుత్వమే భరించింది. రైతుల పట్ల చిత్తశుద్ధి ఎవరికుందో దీన్నిబట్టే అర్థమవుతుంది.