సుపరిపాలనే అతి పెద్ద పరీక్ష

తన 12 ఏళ్ల పాలనపై మోదీ పోస్ట్

ఏపీ నేతల స్పందనలు

న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ చరిత్రలో మరో మైలురాయిని నమోదు చేశారు. ఎన్నికైన ప్రధానుల్లో నిరంతరాయంగా సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన నేతగా ఆయన కొత్త రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మోదీ సామాజిక మాధ్యమ వేదిక 'X' లో తన పాలన, ప్రజా సేవపై ఆలోచనలను పంచుకున్నారు. అలాగే, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సహా పలువురు నేతలు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధానమంత్రి మోదీ తన పోస్టులో ప్రజా సేవను సుపరిపాలనతో అనుసంధానిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రజా సేవ అనేది సుపరిపాలనకు అతిపెద్ద పరీక్ష. వినయం, అంకితభావం, కర్తవ్య దీక్షతో అవిశ్రాంతంగా పనిచేసే వ్యక్తి మాత్రమే ప్రజల విశ్వాసాన్ని పొందగలడు.

ప్రధానికి నేతల అభినందనలు..

మోదీ 12 ఏళ్ల పాలన సందర్భంగా దేశవ్యాప్తంగా అనేకమంది ప్రముఖులు Xలో సందేశాలు పోస్ట్‌ చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విస్తృతంగా స్పందించారు.

కొందరు నాయకులు దేశాన్ని పాలిస్తారు. చాలా కొద్దిమంది మాత్రమే దేశ గతిని మార్చేస్తారు. వారిలో ఒకరే ప్రధాని మోదీ. ఒక సామాన్యుడి ఇంటిలోని నీటి కుళాయి నుంచి చంద్రయాన్‌తో చంద్రుడిని చేరేవరకు.. పొలంలోని రైతు ఆకాంక్షల నుంచి సరిహద్దుల్లోని సైనికుడి ధైర్యం వరకు మోదీ నాయకత్వం దేశ విశ్వాసాన్ని, సామర్థ్యాలను బలోపేతం చేస్తూనే ఉంది. ప్రగతి ఫలాలు ప్రతి భారతీయుడికి చేరేలా చూసింది. ఆయన పాలనలో సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యను పాటించారు. బలహీనులకు మద్దతిస్తూనే అవకాశాలను విస్తరించి భారత ఆర్థిక పునాదులను బలోపేతం చేసే సంస్కరణలను మేళవించారు. కరుణ, ఆశయం రెండూ కలిసి సాగగలవని ఆయన నిరూపించారు. ఈ అద్భుతమైన మైలురాయిని సాధించిన ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రజల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. స్వర్ణాంధ్రను నిర్మించడానికి, వికసిత్‌ భారత్‌ సాకారం అయ్యేందుకు కట్టుబడి ఉన్నాం.

రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ కూడా మోదీ సుదీర్ఘ ప్రధానమంత్రి పదవీకాలంపై ప్రశంసలు కురిపించారు.

దేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలించిన నాయకుడిగా నిలిచిన ప్రధాని మోదీకి నా హృదయపూర్వక అభినందనలు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూను అధిగమించి ఈ అసమానమైన రికార్డును సృష్టించడం నిజంగా అద్భుతం. మోదీ నాయకత్వం ప్రపంచ వేదికపై భారత్‌ను అజేయశక్తిగా నిలబెట్టింది. అవకాశాలు, ప్రజల గౌరవం, స్వావలంబన, సాధికారత వైపు దేశాన్ని నడిపించింది.

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మోదీ సేవా కాలాన్ని, దేశ మార్పును ప్రస్తావించారు.

మాతృభూమిపై గౌరవం, కర్మభూమి సంక్షేమం కోసమే తన జీవితం అంకితం అన్న స్ఫూర్తితోనే ప్రధాని నరేంద్ర మోదీ 4,399 రోజులుగా దేశానికి నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. 12 ఏళ్ల క్రితం భారత్‌ నిర్ణయాత్మక నాయకత్వాన్ని ఎంచుకొంది. నేడు భారత్‌ గతంలో కంటే బలంగా, సురక్షితంగా, మరింత ఆత్మవిశ్వాసంతో నిలబడింది. ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర అభివృద్ధికి నిరంతరం మద్దతిస్తున్న మోదీకి నా కృతజ్ఞతలు. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించే దిశగా మనం కృషి చేస్తున్నాం. వికసిత్‌ భారత్‌ సాకారంలో ఆంధ్రప్రదేశ్‌ బలమైన భాగస్వామిగా ఉన్నందుకు గర్వంగా ఉంది.

మోదీ 12 ఏళ్ల పాలన సందర్భంగా జాతీయ స్థాయిలో రాజకీయ చర్చలు, విశ్లేషణలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం ఈ మైలురాయిని పురస్కరించుకుని చేపట్టే తదుపరి రాజకీయ, ఆర్థిక నిర్ణయాలపై కూడా దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.