రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
బెదిరింపులు వద్దు, ప్రశ్నించడం మా హక్కు:
నాగబాబు పోస్ట్‌పై ప్రకాశ్ రాజ్ స్పందన
ప్రకాష్ రాజ్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సామాజిక, రాజకీయ అంశాలపై తరచూ తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి తన స్పందనతో చర్చనీయాంశమయ్యారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు చేసిన తాజా పోస్ట్‌పై ఆయన కఠినంగా స్పందించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫొటోను పంచుకుంటూ నాగబాబు ఒక పోస్ట్ చేశారు. నాయకుడికి అన్నీ తెలుసన్న భావనతో, ఆయన మాటే శాసనమని, నాయకుడి మాటను అనుసరించాలని, ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని కోరుతూ ఆ పోస్ట్‌ను పెట్టారు. నాయకుడిపై సందేహాలు పెట్టుకోకుండా, మౌనంగా అనుసరించాలని కోరుతూ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.
ఈ నేపథ్యంలో నాగబాబు పోస్ట్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రకాశ్ రాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించారు. నాయకుడిని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందని, మౌనంగా అనుసరించమనే పిలుపు సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మీ సందేహాలను పక్కనపెట్టండి. మౌనంగా నాయకుడిని అనుసరించండి అనడంలో మీ ఉద్దేశం ఏంటి. మేం జంతువులం కాదు మౌనంగా బతకడానికి. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా, నేనే నాయకుడిని అనుకున్నవాడైనా, సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది”
ప్రకాశ్ రాజ్ ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. నాయకుడి నిర్ణయాలను ప్రశ్నించకుండా అంగీకరించాలనే భావనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించినట్లు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈసారి జనసేన నేత నాగబాబు చేసిన పోస్ట్‌పై ఆయన తీసుకున్న ఈ బహిరంగ స్థానం మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.







