అన్నామలై రాజీనామాకు ఆమోదం

కీలక నిర్ణయం తీసుకున్న బీజేపీ అధిష్టానం

తమిళనాడులో సంచలనం

తమిళనాడు బీజేపీకి కీలక నేతగా ఎదిగిన మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై పార్టీ పదవికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం ఆమోదించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ద్రవిడ రాజకీయాల మధ్య బీజేపీకి కొత్త ఊపు తీసుకొచ్చిన యువ నాయకుడి ఈ అడుగు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

కర్ణాటక కేడర్‌కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై, పోలీసు సేవలకు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ కేంద్ర నాయకత్వం ఆయనపై నమ్మకంతో కొద్ది కాలంలోనే తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. ఆ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన పార్టీ విస్తరణ కోసం దూకుడుగా పనిచేశారు.

సాంప్రదాయ ద్రవిడ పార్టీలైన డీఎంకె , ఏఐఏడిఎంకె లకు వ్యతిరేకంగా అన్నామలై ఘాటైన విమర్శలు చేశారు. ముఖ్యంగా ఆయన చేపట్టిన “ఎన్ మన్, ఎన్ మక్కల్” పాదయాత్ర తమిళనాడులో బీజేపీ శ్రేణుల్లో చైతన్యం నింపింది. అధికార డీఎంకె పై అవినీతి ఆరోపణలు చేస్తూ “డీఎంకె ఫైల్స్ ” పేరుతో ఆయన నిర్వహించిన మీడియా సమావేశాలు జాతీయ స్థాయిలో కూడా దృష్టిని ఆకర్షించాయి.

అయితే ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలనే అన్నామలై అభిప్రాయానికి విరుద్ధంగా, పార్టీ హైకమాండ్ ఏఐఏడిఎంకె తో పొత్తు పెట్టుకుంది. ఏఐఏడిఎంకెనేత ఇదప్పడి కే పళనిస్వామి డిమాండ్ మేరకు అన్నామలైకి టికెట్ ఇవ్వలేదనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. ఆ ఎన్నికల్లో ఏఐఏడిఎంకె–బీజేపీ కూటమి మూడో స్థానానికి పరిమితమైంది.

తమిళనాడు బీజేపీలో పాత తరం సీనియర్ నేతలు, అన్నామలై శైలి మధ్య విభేదాలు ఉన్నాయనే చర్చ చాలా కాలంగా కొనసాగుతోంది. ఈ రాజకీయ పరిణామాల మధ్యే ఆయన బీజేపీకి రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజీనామాకు ముందు అన్నామలై, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో న్యూఢిల్లీ లో ప్రత్యేకంగా భేటీ అయినట్లు సమాచారం. ఆ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అన్నామలై తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ స్థాపనపై ఆలోచిస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. గతంలో డీఎంకె అవినీతి అంశాలను బహిర్గతం చేసిన ఆయన, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారని ఆయనకు సమీప వర్గాలు అంటున్నాయి. బీజేపీలో కొనసాగితే తన రాజకీయ లక్ష్యాలు సాధ్యం కాదనే భావనతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అన్నామలై బీజేపీని వీడటం ఆ పార్టీకి తమిళనాడులో పెద్ద దెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ద్రవిడ గడ్డపై బీజేపీకి కొత్త ఇమేజ్ తీసుకొచ్చిన నాయకుడి వైదొలగింపు తర్వాత ఆ పార్టీ రాష్ట్ర వ్యూహంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇకపై తమిళనాడు రాజకీయాల్లో అన్నామలై తదుపరి అడుగు ఏంటన్న దానిపై రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది.