తిరుపతిలో రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలోని తారకరామా గ్రౌండ్స్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని పోటీలకు శ్రీకారం చుట్టారు.

రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 9 వేలకుపైగా అండర్‌-17, అండర్‌-23 వయో విభాగాలకు చెందిన బాలబాలికల క్రీడాకారులు ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో పాల్గొనేందుకు తిరుపతికి చేరుకున్నారు. ఇంత భారీ స్థాయిలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను నిర్వహించడం ద్వారా యువ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు, వారికి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రోత్సాహం అందించేందుకు ఈ ఛాంపియన్‌షిప్ దోహదపడుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రారంభోత్సవం అనంతరం మంత్రి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని వెయిట్‌లిఫ్టింగ్ హాల్, వివిధ క్రీడా ప్రాంగణాలు, ప్లేయర్ రిజిస్ట్రేషన్ కౌంటర్లను పరిశీలించారు. క్రీడాకారులకు కల్పిస్తున్న వసతులు, పోటీల నిర్వహణ విధానం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్‌కు తిరుపతి వేదిక కావడం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

భారీ స్థాయిలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీలు Asia Book of Records‌లో స్థానం దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. ఈ రికార్డుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని Limca Book ప్రతినిధి హరీష్, SHAP చైర్మన్ రవినాయుడు‌కు అందజేశారు. అనంతరం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా SHAP చైర్మన్ రవినాయుడు అవార్డును స్వీకరించారు.

యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. క్రీడాకారులకు మెరుగైన మౌలిక వసతులు, శిక్షణ, ప్రోత్సాహం అందిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను క్రీడా రంగంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.