శ్రీకాళహస్తి: పట్టణంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో (SIR) లోపాలు చోటుచేసుకోవడంపై మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తన ఓటర్ల వివరాల్లోనే తప్పులు నమోదయ్యాయని ఆరోపిస్తూ మున్సిపల్ కమిషనర్ కె.వి. కృష్ణారెడ్డికి వినతిపత్రం సమర్పించారు.

శ్రీకాళహస్తి మున్సిపల్ పరిధిలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. తన నివాస చిరునామాకు సంబంధించిన నాలుగు ఓట్ల వివరాలు జాబితాలో తప్పుగా నమోదయ్యాయని గుర్తించిన ఆయన, దీనిపై సంబంధిత అధికారులు జారీ చేసిన నోటీసులను స్వీకరించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్‌ను కలిసి సమస్యను వివరించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, పట్టణంలోని అనేక వార్డుల్లో ఓటర్ల జాబితాలో పేర్లు, ఇతర వివరాలు తప్పుగా నమోదు అవుతున్నాయనే ఫిర్యాదులు ప్రజల నుంచి వస్తున్నాయని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అర్హత ఉన్న ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల నిర్వహణాధికారులపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జాబితాలో జరిగిన తప్పిదాలపై సమగ్ర విచారణ జరిపి, అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్ల జాబితాలో నమోదు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

తరువాత SIR ప్రక్రియలో భాగంగా వివిధ వార్డుల్లో జరుగుతున్న కార్యక్రమాలను మధుసూదన్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. అక్కడికి వచ్చిన ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఓటర్ల జాబితాలో వారి పేర్లు ఉన్నాయా లేదా, వివరాలు సక్రమంగా నమోదయ్యాయా అనే అంశాలపై ప్రజల నుంచి సమాచారం సేకరించారు.

“నా ఇంట్లోనే నాలుగు ఓట్ల విషయంలో తప్పులు జరిగితే.. పట్టణంలోని సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి?”

అని మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.