రాయలసీమ న్యూస్, తిరుపతి: రేణిగుంట: రేణిగుంట పరిధిలోని గాజులమండ్యం సమీపంలో ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుత్తూరు వైపు వెళ్తున్న ఓ ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టిన ఘటన స్థానికులను కలచివేసింది.
పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం… పుత్తూరు దిశగా ప్రయాణిస్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు అధిక వేగంతో ఢీకొట్టింది. ఢీకొన్న ధాటికి ఆటో అదుపుతప్పి రోడ్డుమధ్యలోని డివైడర్‌పైకి ఎగిరిపడింది. ప్రమాద సమయంలో ఆటోలో ఒకే కుటుంబానికి చెందిన మహిళలు, చిన్నారులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మహిళలు, చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా ఓ చిన్నారికి తలకు బలమైన గాయం కావడంతో పాటు కుడి కాలు విరిగి ఎముక బయటకు కనిపించేంతగా తీవ్ర రక్తస్రావం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయాల తీవ్రత కారణంగా ఆటోలో ప్రయాణించిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు.
ఢీకొన్న ప్రభావానికి కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. స్టీరింగ్ భాగం కూడా తీవ్రంగా నాశనమైంది. సంఘటన స్థలంలోనే కారు నిలిచిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ తప్పు ఆటో డ్రైవర్‌దేనంటూ వాదనకు దిగినట్లు అక్కడున్న వారు చెబుతున్నారు.
కారు డ్రైవర్ ఆటోనే తప్పుగా నడిపారని చెప్పేందుకు ప్రయత్నించగా, అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షులు, ముఖ్యంగా సమీపంలోని పంక్చర్ దుకాణం వ్యక్తి తదితరులు అతని వాదనను తీవ్రంగా ఖండించారు. కారు అతివేగంగా వెనుక నుంచి వచ్చి ఆటోను ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని వారు స్పష్టం చేశారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కారు, ఆటోలను రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను సవ్యంగా కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.













