రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఆవరణ అంతటా వైదిక మంత్రోచ్ఛారణల మధ్య మొదటి రోజు పవిత్ర ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపు చేసి, అక్కడ హోమాలు, జపాలు, ఇతర వైదిక క్రతువులను ఆచరించారు.
యాగశాలలో నిర్వహించిన హోమాల అనంతరం సంపంగి ప్రాకారంలో స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారికి పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆలయ వాతావరణం భక్తుల గోషలతో, వేద మంత్రాల నాదంతో భక్తిమయంగా మారింది.

స్నపన తిరుమంజనం సమయంలో వేద పండితులు పంచసూక్తాలను పఠించారు. అనంతరం పవిత్ర ప్రతిష్ట కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేసి, నైవేద్యాలు, పూజలు సమర్పించారు.
సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా తిరుమల వీధులంతా దీపాలంకరణలతో, పుష్పాలంకరణలతో అలంకరించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. స్వామివారి ఊరేగింపును వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున, భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టారు.
రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా ప్రతి రోజు ప్రత్యేక హోమాలు, పూజలు, నైవేద్యాలు నిర్వహించే కార్యక్రమాన్ని టీటీడీ ముందస్తుగా రూపొందించింది.
ఈ పవిత్రోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. వైదిక కార్యక్రమాల నిర్వహణ, భక్తుల సౌకర్యాల కోసం సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేశారు.













