రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుమలలో ఇటీవల జరిగిన మద్యం, గుట్కా పట్టివేతలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మాజీ MLA భూమన కరుణాకర్ ఆరోపించారు. ఈ పట్టివేతల వివరాలు, కేసు నమోదు తీరుపై స్పష్టత లేకపోవడం వల్లే అనుమానాలు ఉత్పన్నమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు.
తిరుమలలో మద్యం, గుట్కా నిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో ఇటీవలి ఘటనలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని భూమన కరుణాకర్ పేర్కొన్నారు. ఈ ఘటనలపై విజిలెన్స్ విభాగం పూర్తి వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆగస్టు 21న కౌస్తుభం గెస్ట్‌హౌస్ సమీపంలో 182 మద్యం బాటిళ్లు అమ్ముతుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. అదేరోజు నాగతీర్థం వద్ద 1,000కు పైగా గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. అయితే మరుసటి రోజు 20 బాటిళ్లతో బాలాజీ లింక్ బస్‌స్టాండ్ వద్ద పట్టుకున్నట్లు కేసు ఎలా నమోదైంది
ఈ విధంగా ఒకే ప్రాంతంలో, చాలా తక్కువ వ్యవధిలో వరుసగా కేసులు నమోదు కావడం, వాటి వివరాలు స్పష్టంగా బయటకు రాకపోవడం అనుమానాలకు తావిస్తున్న అంశమని భూమన కరుణాకర్ వ్యాఖ్యానించారు. తిరుమల వంటి పవిత్రక్షేత్రంలో మద్యం, గుట్కా లాంటి నిషేధిత పదార్థాలు ఎలా చొరబడుతున్నాయో, ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందో అధికారాలు సమగ్రంగా విచారణ జరిపించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
తిరుమలలో భక్తుల విశ్వాసానికి భంగం కలిగించే ఏ అంశాన్నీ సహించరాదని, ఈ ఘటనలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి, నిజాలు భక్తుల ముందుంచాలని భూమన కరుణాకర్ డిమాండ్ చేశారు. విజిలెన్స్ అధికారులు, సంబంధిత విభాగాలు పారదర్శకంగా వ్యవహరించి, కేసుల వివరాలు, పట్టుబడిన వస్తువుల గణాంకాలు, తదుపరి చర్యలపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.













