రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
ధర్మస్థల కేసులో పుకార్లు నమ్మొద్దు : ప్రకాష్ రాజ్
కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలను కుదిపేసిన కేసు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. వందలాది మృతదేహాల సామూహిక ఖననం ఆరోపణలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పుడు నటుడు ప్రకాష్ రాజ్ పేరు ప్రస్తావనకు రావడంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో కలకలం రేగింది.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న చిన్నయ్య అనే వ్యక్తి జూన్ 11న కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కొందరి ఒత్తిడి మేరకే తాను స్టేట్మెంట్లు ఇచ్చానని, ఆ సమయంలో ప్రకాష్ రాజ్ తనతో తమిళంలో మాట్లాడారని చిన్నయ్య పిటిషన్లో ఆరోపించాడు. జూలై 29న వచ్చి తనను గట్టిగా కౌగిలించుకుంటానని ప్రకాష్ రాజ్ హామీ ఇచ్చారని కూడా అతను పిటిషన్లో పేర్కొన్నట్టు సమాచారం. ఈ ఆరోపణలతో సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.
తన పేరు చుట్టూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ప్రకాష్ రాజ్, సోషల్ మీడియా ద్వారా స్పష్టీకరణ ఇచ్చారు. ధర్మస్థల కేసుతో తనను ముడిపెడుతూ మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు తన దృష్టికి వచ్చాయని ఆయన తెలిపారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అత్యంత సున్నితమైన అంశమిదని, ఇలాంటి సందర్భంలో తనపై వస్తున్న అనుమానాలకు సమాధానం చెప్పడం తన బాధ్యతగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
ప్రస్తుతం తాను కాస్త దూరంగా ఉన్నానని, మరో రెండు రోజుల్లో స్వయంగా వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించి అన్ని నిజాలు చెబుతానని ప్రకాష్ రాజ్ తన సందేశంలో వెల్లడించారు. అంతవరకు కొందరు వ్యక్తులు ఈ వార్తలకు జోడిస్తున్న పుకార్లు, అతిశయోక్తులను నమ్మవద్దని ఆయన కోరినట్టు తెలుగు అనువాదాల్లో వెల్లడైంది.
ఇక ధర్మస్థల కేసు విషయానికి వస్తే, 1995 నుండి 2014 మధ్య కాలంలో అత్యాచారాలు, హత్యలకు గురైన వందలాది మంది మహిళలు, స్కూల్ పిల్లల శవాలను బలవంతంగా పూడ్చిపెట్టేలా అప్పటి యాజమాన్యం వేధించిందని ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రత్యేక దర్యాప్తు సంస్థ SIT ఆ కార్మికుడు చూపించిన ప్రాంతాల్లో తవ్వకాలు జరపగా అస్థిపంజరాలు బయటపడినట్టు వెల్లడైంది. అయితే పంచాయతీ అధికారులు అవి గుర్తుతెలియని అనాథ శవాలని పేర్కొంటున్నారు.
ఇలాంటి భయానక ఆరోపణలతో కూడిన కేసులో ప్రకాష్ రాజ్ పేరు ప్రస్తావనకు రావడం సినీ వర్గాల్లో ఆందోళనకు దారితీసింది. మరో రెండు రోజుల్లో జరగనున్న ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్లో ఆయన ఏ వివరాలు బయటపెడతారన్నదానిపై అందరి దృష్టి నిలిచింది.







