రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా జమ్మలమడుగు విద్యుత్ శాఖ పరిధిలో వ్యవసాయ పొలాల్లో విద్యుత్ పరికరాల చోరీలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లు, మోటారు కేబుల్ తీగలు, స్టార్టర్లు ఎత్తుకెళ్లడం వల్ల అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుసగా జరుగుతున్న ఈ చోరీలతో గ్రామీణ ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
జమ్మలమడుగు విద్యుత్ శాఖ పరిధిలోని పలు మండలాల్లో ఇటీవలి రోజులుగా చోరీలు పెరిగాయి. ముద్దనూరు మండలం పెద్ద దుద్యాల గ్రామంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి, అందులోని ఆయిల్, రాగిని అపహరించినట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో వ్యవసాయ మోటార్లు పనిచేయక పంటలకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇటీవల పెద్దముడియం మండలం మేదిదిన్నె, జమ్మలమడుగు మండలం ఎస్.ఉప్పలపాడు, కొండాపురం మండలం రామిరెడ్డిపల్లె, బురుజుపల్లె, కొట్టాలపల్లె, బ్రాహ్మణపల్లి, వెంకయ్యకాల్వ తదితర గ్రామాల్లో వ్యవసాయ బోర్ల వద్ద మోటార్ల నుంచి స్టార్టర్ల వరకు కేబుల్ తీగలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు రైతులు చెబుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ నియంత్రికలను ధ్వంసం చేసి అందులోని రాగి తీగలు, ఆయిల్‌ను అపహరించే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
విద్యుత్ పరికరాలు దెబ్బతినడంతో వ్యవసాయ మోటార్లు పనిచేయక పంటలకు నీరు అందించలేక రైతులు నష్టపోతున్నారు. చోరీకి గురైన పరికరాలను తిరిగి ఏర్పాటు చేసుకోవడం రైతులకు అదనపు ఆర్థిక భారంగా మారుతోంది. ఇప్పటికే ఎరువులు, విత్తనాలు, కార్మిక వ్యయాలు పెరిగిన నేపథ్యంలో విద్యుత్ పరికరాల చోరీలు మరింత భారంగా మారాయని రైతులు వాపోతున్నారు.
జమ్మలమడుగు విద్యుత్ శాఖ పరిధిలోని ఆరు మండలాల్లో మొత్తం 10,379 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వరుస చోరీలతో రాత్రి వేళల్లో కూడా పొలాల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాలను వదిలి పొలాల్లో గడపాల్సి వస్తోందని, అయినా కూడా భద్రతపై నమ్మకం కలగడం లేదని వారు పేర్కొంటున్నారు.
విద్యుత్ పరికరాలు చోరీకి గురైనప్పుడు సమీప పోలీస్ స్టేషన్‌లో తప్పనిసరిగా ఫిర్యాదు చేసి, ఎఫ్‌ఐఆర్ ప్రతిని పొందాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. చోరీల వివరాలు నమోదు కావడం, భవిష్యత్తులో చర్యలు తీసుకోవడంలో ఇది ఉపయోగపడుతుందని వారు తెలియజేస్తున్నారు.
వ్యవసాయ పరికరాల చోరీలను అరికట్టి, రైతులకు భద్రత కల్పించేందుకు పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ సమన్వయంతో కఠిన చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గస్తీ పెంచి, చోరీలకు పాల్పడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.













