ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరును సాధిస్తామని వేదికలపై ఘనంగా ప్రకటిస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరోవైపు పట్టణంలోనే నడుస్తున్న అక్రమ ప్లాస్టిక్ ఖాళీ వాటర్ బాటిళ్ల తయారీ కేంద్రంపై మాత్రం చర్యలు తీసుకోకపోవడం స్థానికుల్లో ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

ఆగస్టు 15 వేడుకల సందర్భంగా ప్రొద్దుటూరులో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తూతీక శ్రీనివాస్ విశ్వనాథ్ ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరును నిర్మించేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రజల ముందు ప్రమాణాలు చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.

అయితే అదే పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయానికి ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఏటి పరంబోకు భూమిలో, ఓ స్విమ్మింగ్ పూల్ పక్కనే ఎలాంటి అనుమతులు లేకుండా ఖాళీ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల తయారీ కేంద్రం నడుస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ యూనిట్ యజమాని రాజకీయ నాయకులు, అధికారులు తనకు తెలుసునని చెబుతూ, ప్రశ్నించడానికి వెళ్లే వారిపై దౌర్జన్యానికి దిగుతున్నాడని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. అయినప్పటికీ సంబంధిత శాఖలు కనీసం తనిఖీకి కూడా రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్లాస్టిక్ లేదా PET బాటిళ్ల తయారీ యూనిట్ స్థాపించాలంటే అనేక చట్టబద్ధ అనుమతులు తప్పనిసరి. ప్లాస్టిక్ రీసైక్లింగ్ లేదా తయారీ కోసం కాలుష్య నియంత్రణ మండలి నుంచి ‘Consent to Establish’, ‘Consent to Operate’ అనుమతులు పొందాలి. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనల ప్రకారం Producer లేదా Manufacturer‌గా State Pollution Control Board వద్ద నమోదు చేయించుకోవాలి.

అదనంగా, స్థానిక మున్సిపాలిటీ లేదా పంచాయతీ నుంచి ట్రేడ్ లైసెన్స్, పన్నుల నిర్వహణ కోసం GST రిజిస్ట్రేషన్ ఉండాలి. పరిశ్రమ స్థాపన నిమిత్తం జిల్లా పరిశ్రమల కేంద్రం వద్ద ఉద్యోగ ఆధార్‌తో DIC రిజిస్ట్రేషన్ అవసరం. ప్లాస్టిక్ యూనిట్లలో అగ్నిప్రమాదాల ప్రమాదం ఎక్కువగా ఉండటంతో Fire Department, విద్యుత్ శాఖ, స్థానిక ఆరోగ్య శాఖల నుంచి భద్రతా ధృవీకరణ పత్రాలు కూడా తప్పనిసరి.

ఇన్ని రకాల అనుమతులు అవసరమైన పరిస్థితుల్లో, ఎలాంటి పత్రాలు లేకుండా, GST కూడా చెల్లించకుండా ప్రభుత్వ పరంబోకు భూమిలో నడుస్తున్న ఈ యూనిట్‌పై అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనుక కారణాలేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఒకవైపు మైకుల ముందు ప్లాస్టిక్ నిషేధంపై యజ్ఞం చేస్తున్నామని చెప్పే మున్సిపల్ కమిషనర్ తూతీక శ్రీనివాస్ విశ్వనాథ్, అధికారంలో ఉన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మరోవైపు ఈ అక్రమ ప్లాస్టిక్ యూనిట్‌పై మాత్రం మౌనం పాటించడం స్థానిక ప్లాస్టిక్ వ్యతిరేక సంఘాలు, పౌర సంఘాల ఆగ్రహానికి కారణమైంది.

అధికారులకు నిజంగానే ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుపై చిత్తశుద్ధి ఉంటే, వెంటనే ఈ అక్రమ ఖాళీ బాటిళ్ల తయారీ కేంద్రాన్ని సీజ్ చేసి, నిర్దాక్షిణ్యంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.