వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన పార్టీలకు పోటీగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పావులు కదుపుతున్నాయి. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఎస్. ఇర్ఫాన్ బాషా పార్టీ బలోపేతంపై దృష్టి సారించడంతో చేరికల పరంపర కొనసాగుతోంది.

ఈ క్రమంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 11వ వార్డు పరిధిలో కడప డీసీసీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయజ్యోతి సమక్షంలో ఎస్. మహబూబ్ బాషాతో పాటు సుమారు 40 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నూతనంగా చేరిన వారికి డీసీసీ అధ్యక్షురాలు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మహబూబ్ బాషాను కాంగ్రెస్ తరఫున బరిలోకి దింపనున్నట్లు పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఇర్ఫాన్ బాషా స్థానిక పాలకులు, మాజీ ప్రజాప్రతినిధులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత ఐదు దశాబ్దాలుగా ప్రొద్దుటూరులో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, పట్టణాన్ని ప్రజా సంక్షేమం కోసం కాకుండా వ్యాపార కేంద్రంగా మార్చుకుని పాలకులు వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని ఆరోపించారు. పట్టణంలో ఇప్పటికీ సరైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, మెడికల్ కాలేజీ వంటి కనీస మౌలిక వసతులు లేకపోవడం పాలకుల అసమర్థతకు నిదర్శనమని పేర్కొన్నారు.

దాదాపు 70 ఏళ్లుగా తాగునీటి పైప్‌లైన్లు మార్పు చేయని పరిస్థితి కొనసాగుతుండగా, కోనేటి కాలువ వీధిలో ప్రజలతో కలిసి ధర్నా చేసిన తర్వాతే అధికారులు స్పందించారని ఇర్ఫాన్ బాషా గుర్తుచేశారు. గతంలో టీడీపీకి గోరీ కడతానన్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఏడాదికి రూ.500 కోట్లు తెచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు. ఆయన చేసిన అభివృద్ధి ఏమిటో రానున్న ఎన్నికల్లో ప్రజలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.

ప్రొద్దుటూరు సమగ్ర అభివృద్ధి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ద్వారానే సాధ్యమని, రాబోయే స్థానిక ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి ఆదరించాలని ప్రజలను కోరారు. పట్టణంలో జరుగుతున్న తాజా చేరికలు పార్టీ క్షేత్రస్థాయి బలాన్ని మరింత పెంచుతున్నాయని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.

ఓటు హక్కు రాజ్యాంగం ప్రసాదించిన వజ్రాయుధం. సరైన నాయకులను ఎన్నుకోవడానికి ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలి.

అని డీసీసీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయజ్యోతి పేర్కొన్నారు. గత 15 ఏళ్లుగా దేశం, రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని, నాడు కాంగ్రెస్ హయాంలోనే సంక్షేమ పథకాలకు అసలైన పునాది పడిందని ఆమె గుర్తుచేశారు.

కేంద్రంలోని BJP సర్కార్ మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల ప్రజాస్వామిక హక్కులను హరిస్తోంది. ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో దేశానికి రాహుల్ గాంధీ , రాష్ట్రానికి YS షర్మిల నాయకత్వం అత్యంత ఆవశ్యకం. వైఎస్సార్ కడప జిల్లా అభివృద్ధికి షర్మిల నిరంతరం శ్రమిస్తున్నారు.

అని విజయజ్యోతి వ్యాఖ్యానించారు. ప్రొద్దుటూరు పట్టణాన్ని దోమల బెడద, పారిశుధ్య లోపం తీవ్రంగా వేధిస్తున్నాయని, ఇర్ఫాన్ బాషా నాయకత్వానికి ప్రజలు అండగా నిలిచి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆమె కోరారు. తాజా చేరికలు పార్టీకి ఉత్సాహాన్ని నింపుతున్నాయని, రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు సమగ్ర విజయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయని నాయకులు తెలిపారు.