రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. పట్టణంలో కుక్కల బెడదపై వచ్చిన ఫిర్యాదుకు స్పందిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సోమవారం ప్రొద్దుటూరులో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఓ వ్యక్తి మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్ చేసి, వీధుల్లో తిరుగుతున్న కుక్కల వల్ల ఇబ్బందులు పడుతున్నామని, కుక్కల బెడద ఎక్కువైందని ఫిర్యాదు చేశాడు. దీనికి స్పందించిన కమిషనర్ విశ్వనాథ్, కుక్కల కంటే మనుషులే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.
కుక్కల కన్నా మనుషులే డేంజర్
ఈ వ్యాఖ్య వెలుగులోకి రావడంతో స్థానికంగా, సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చెలరేగాయి. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్న అధికారి ఇలా మాట్లాడటం సముచితం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో అనంతపురం మున్సిపల్ ఆర్డీ నాగరాజును సంప్రదించి వివరణ కోరింది. ఫిర్యాదుదారులతో వ్యవహరించే తీరు, అధికారుల బాధ్యతలపై ఆయన స్పందించారు. ప్రజలు సమస్యలతో అధికారులను సంప్రదించినప్పుడు, వారు బాధ్యతాయుతంగా, శాంతంగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
కమిషనర్ విశ్వనాథ్ చేసిన వ్యాఖ్య సరైంది కాదని, ఆ విధంగా మాట్లాడడం తప్పేనని ఆర్డీ నాగరాజు స్పష్టం చేసినట్లు తెలిపింది. ప్రజల ఫిర్యాదులను తేలికగా తీసుకోవడం, వారి భావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం వంటి ధోరణి అధికారుల్లో ఉండకూడదని ఆయన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం.
ప్రొద్దుటూరులో కుక్కల సమస్యపై స్థానికులు పలుమార్లు మున్సిపాలిటీ దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ, తగిన చర్యలు తీసుకోవడంలో లోపాలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమిషనర్ వ్యాఖ్య మరింత ఆగ్రహానికి కారణమైంది. ప్రజల సమస్యలపై సున్నితంగా స్పందించాల్సిన సమయంలో, వాటిని చిన్నచూపు చూసేలా ఉన్న ఈ వ్యాఖ్యపై అధికార వర్గాలు ఎలా స్పందిస్తాయన్న దానిపై ఆసక్తి నెలకొంది.













