రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: రాయలసీమ ప్రజల దశాబ్దాల కలగా నిలిచిన కడప ఉక్కు కర్మాగారం నిర్మాణానికి కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి పలువురు నేతలు శంకుస్థాపనలు చేసినప్పటికీ, పనులు మాత్రం భూమిపైకి రాలేదు. వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భూమి పూజ చేసినా, క్షేత్రస్థాయిలో ఒక్క ఇటుక కూడా వేయని పరిస్థితి నెలకొంది.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత జేఎస్‌డబ్ల్యూ ప్రతినిధులతో పలు దఫాలుగా చర్చలు జరిపి ప్రాజెక్ట్‌ను మళ్లీ పట్టాలెక్కించింది. ఉక్కు కర్మాగారం స్థాపనకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుతో పాటు అత్యంత కీలకమైన నీటి సరఫరా అంశాన్ని ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుంది. గండికోట జలాశయం నుంచి పైప్‌లైన్ల ద్వారా పరిశ్రమకు నీటిని తరలించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
ఈ క్రమంలో జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె, పెద్దదండలూరు పరిసర ప్రాంతాల్లో జులై 3న ప్రతిష్ఠాత్మక కడప ఉక్కు కర్మాగారానికి పునాది రాయి వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాన అతిథిగా హాజరుకానున్నారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొననున్నట్లు సమాచారం. ఈ మేరకు మంగళవారం సీఎంవో నుంచి జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
దేశంలో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకటైన జిందాల్ గ్రూప్ ఆధ్వర్యంలోని జేఎస్‌డబ్ల్యూ సంస్థ ఈ మెగా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. మొత్తం రూ.16,350 కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. గతంలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఉన్న సాంకేతిక, న్యాయపరమైన అడ్డంకులను కూటమి ప్రభుత్వం పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంది.
ఏపీఐఐసీ ద్వారా వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ నుంచి జేఎస్‌డబ్ల్యూ సంస్థకు 1,100 ఎకరాల భూమిని అధికారికంగా బదిలీ చేస్తూ ఒప్పందం పూర్తి చేశారు. దీంతో వార్షికంగా 3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో నడిచే కర్మాగారం స్థాపనకు మార్గం సుగమమైంది.
ఇప్పటి వరకు దేశంలో సాధారణంగా అమలులో ఉన్న బ్లాస్ట్ ఫర్నెస్ విధానానికి భిన్నంగా, ఈ ప్లాంట్‌లో కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఆధునిక ‘ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్’ సాంకేతికతను వినియోగించనున్నారు. కర్మాగారం ద్వారా ప్రత్యక్షంగా సుమారు 2,500 మందికి ఉపాధి లభించనుండగా, అనుబంధ పరిశ్రమల ద్వారా వేలాది మంది స్థానిక నిరుద్యోగ యువతకు పరోక్ష ఉపాధి అవకాశాలు కలిగే అవకాశముంది.
ఉక్కు కర్మాగారం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఈ ప్రాంతం దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన ఉక్కు హబ్‌గా అవతరించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ప్రాజెక్ట్ అమలుతో స్థానికుల వలసలు తగ్గి, రాయలసీమ ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో కొత్త ఊపిరి నింపబడనుందని అంచనా వేస్తున్నారు.













