రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు, అర్బన్ మేజర్ న్యూస్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ విమర్శలు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది. జమ్మలమడుగు నియోజకవర్గ పరిశీలకులు పోరెడ్డి నరసింహారెడ్డి శనివారం ప్రొద్దుటూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం వైఎస్సార్సీపీ ఎందుకు ప్రయత్నించిందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ప్రశ్నించడం, అలాగే మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి తనకు మధ్య విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం చేయడం సరికాదని పోరెడ్డి నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రజలకు బాగా తెలిసిన విషయమని ఆయన పేర్కొన్నారు.
నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లే సమయంలో అడ్డంకులు సృష్టించడం, నామినేషన్ కేంద్రాల వద్ద దాడులకు పాల్పడటం, నామినేషన్ పత్రాలను చించివేయడం, అరెస్టులు చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని పోరెడ్డి ఆరోపించారు. ఈ పరిణామాలను మీడియా ద్వారా ప్రజలు గమనించారని ఆయన తెలిపారు.
ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా తన పేరును మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ముందుగానే ప్రకటించారని పోరెడ్డి నరసింహారెడ్డి వెల్లడించారు. మున్సిపల్ చైర్మన్ పదవి రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం జనరల్ కేటగిరీకి కేటాయిస్తే తనను, బీసీకి కేటాయిస్తే బీసీ నాయకుల్లో ఒకరిని, జనరల్ మహిళకు కేటాయిస్తే రాచమల్లు రమాదేవిని వైఎస్సార్సీపీ తరఫున పోటీకి నిలపాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు వివరించారు.
ఎన్నికల నామినేషన్ల సమయంలో ప్రొద్దుటూరులో చోటుచేసుకున్న పరిణామాలు, టీడీపీ నాయకుల వ్యవహారశైలి ప్రజలకు తెలుసని పోరెడ్డి నరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ చైర్మన్ అభ్యర్థి నంద్యాల రాఘవరెడ్డి గతంలో కామనూరు పరిధిలో ఉన్న ఓటును జూన్ 26న నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ద్వారా ప్రొద్దుటూరుకు మార్చుకున్నారని ఆయన ఆరోపించారు.
నామినేషన్ దాఖలు చేసే సమయానికి ఓటరు జాబితాలో నంద్యాల రాఘవరెడ్డి పేరు లేకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి అనుమతి పొందారని, అయితే సంబంధిత న్యాయస్థాన ఉత్తర్వుల రాతపూర్వక ప్రతులను అధికారులు చూపించలేదని పోరెడ్డి నరసింహారెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఏకగ్రీవాలు సాధించామని టీడీపీ సంబరాలు చేసుకోవడం ప్రజాస్వామ్య ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధమని ఆయన విమర్శించారు.
ప్రజల ఓట్లతో ఎన్నికైనప్పుడే ప్రజాప్రతినిధులకు నిజమైన ప్రజా నాయకులుగా గుర్తింపు లభిస్తుందని పోరెడ్డి నరసింహారెడ్డి అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.













