రాయలసీమ న్యూస్, అనంతపురం: ప్రస్తుత స్థానిక ఎన్నికల నేపథ్యంలో అనంతపురం నగరంలో శాంతి భద్రతలను బలోపేతం చేయడం, ప్రజల్లో నమ్మకం పెంపొందించడం లక్ష్యంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు అర్బన్ DSP కరుణాకరరావు, AR-DSP నీలకంఠేశ్వరరెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ ప్లాగ్ మార్చ్‌లో భారీ సంఖ్యలో పోలీసు సిబ్బంది, కమాండోలు పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన వీధుల గుండా క్రమబద్ధంగా కవాతు నిర్వహిస్తూ, ఎన్నికల సమయంలో శాంతి భద్రతల పరంగా పోలీసులు తీసుకుంటున్న చర్యలను ప్రజలకు ప్రత్యక్షంగా చూపించారు.
ప్రజల్లో ధైర్యాన్ని, భరోసాను నింపేందుకు మైన్స్ ఫ్రూఫ్ వాహనం, వజ్ర, వాటర్ క్యానన్ వంటి అత్యాధునిక రక్షణ వాహనాలను కూడా ఈ కవాతులో వినియోగించారు. నగరంలోని కీలక ప్రాంతాల గుండా ఈ వాహనాలు ప్రయాణించగా, ప్రజలు వీటిని ఆసక్తిగా వీక్షించారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల భాగంగా ఈ ప్లాగ్ మార్చ్‌ను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన అదనపు బలగాలను కూడా సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు.
పోలీసుల భారీ కవాతు, ఆధునిక రక్షణ వాహనాల ప్రదర్శనతో నగరంలో ఎన్నికల వాతావరణం మధ్య భద్రతా హామీ స్పష్టంగా కనిపించిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రక్రియ అంతటా శాంతియుత వాతావరణం నెలకొనేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసు అధికారులు స్పష్టం చేశారు.













