రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: అనంతపురం జిల్లాకు చెందిన యువ రంజీ క్రికెటర్ మచ్చా దత్త రెడ్డి మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. అద్భుతమైన బ్యాటింగ్, వికెట్ కీపింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆయనను ఆంధ్ర అండర్-23 రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-23 ఇంటర్జోనల్, అంతర్జిల్లా పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన దత్త రెడ్డి ఈ అవకాశాన్ని సొంతం చేసుకున్నారు.
ఈ క్రికెట్ సీజన్లో మచ్చా దత్త రెడ్డి బ్యాటింగ్‌లో అసాధారణ ఫామ్‌లో నిలిచారు. మొత్తం 1675 పరుగులు సాధించి, 2 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు నమోదు చేశారు. సీనియర్ ఆంధ్ర ఇంటర్జోనల్ పోటీల్లో ఒక సెంచరీతో పాటు 161 పరుగులు చేసి తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించారు.
ఇదే సీజన్లో 114 సిక్సర్లు బాదిన మచ్చా దత్త రెడ్డి ఆంధ్ర క్రికెట్లో అరుదైన రికార్డు నమోదు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్‌లోనూ స్థిరమైన ప్రదర్శన చేస్తూ ఆంధ్ర వికెట్ కీపర్లలో తన స్థానాన్ని బలపరుచుకున్నారు.
మచ్చా దత్త రెడ్డి ఇప్పటికే అండర్-12, అండర్-16, అండర్-19, అండర్-23 విభాగాల్లో ఆంధ్ర రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలోని నేషనల్ క్రికెట్ అకాడమీ శిక్షణకు కూడా ఆయన ఎంపికయ్యారు. ఆంధ్ర రాష్ట్ర జట్టుకు అనేక సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ కీలక సందర్భాల్లో తన బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో భాగస్వామిగా నిలిచారు.
ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో తుంగభద్ర వారియర్స్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన మచ్చా దత్త రెడ్డి, దేశీయ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంటున్నారు.
ఆంధ్ర అండర్-23 జట్టు తదుపరి పోరులో అస్సాం జట్టుతో తలపడనుంది. నవంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు అనంతపురంలోని RDT మైదానంలో నాలుగు రోజుల మ్యాచ్ జరగనుంది. స్వస్థలమైన అనంతపురంలోనే ఆంధ్ర అండర్-23 జట్టుకు మచ్చా దత్త రెడ్డి ప్రాతినిధ్యం వహించనుండటంతో స్థానిక క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
మచ్చా దత్త రెడ్డి ఆంధ్ర అండర్-23 రాష్ట్ర జట్టుకు ఎంపిక కావడం పట్ల RDT ప్రోగ్రామ్ డైరెక్టర్ మంచో ఫెర్రర్, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనాథ్, కార్యదర్శి శ్రీధర్, సీనియర్ క్రికెటర్లు, అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ఆంధ్ర క్రికెట్‌కు, అనంతపురం జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.













