అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కొండాపురం గ్రామం నీటి సంరక్షణ చర్యలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించింది. గ్రామాభివృద్ధి భాగంగా చేపట్టిన నీటి వనరుల పరిరక్షణ, వినియోగం, నిల్వల పెంపు చర్యలు కొండాపురం గ్రామానికి జాతీయ స్థాయి పురస్కారం తెచ్చిపెట్టాయి.

కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ అవార్డుల్లో ‘ వాటర్ షఫిసియెంట్ విల్లెజ్ ’ విభాగంలో దేశంలోని ఆరు రాష్ట్రాల నుంచి గ్రామాలు పోటీపడగా, కొండాపురం గ్రామపంచాయతీ మొదటి స్థానానికి ఎంపికైంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని గురువారం కేంద్ర స్థాయి అధికారుల బృందం గ్రామాన్ని సందర్శించి అభివృద్ధి పనులను సమీక్షించింది.

కేంద్ర బృందంలో జకీర్ హుస్సేన్, ఆశిష్ యాదవ్‌తో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ ఓఎస్డీ శ్రీనాథరెడ్డి, రాష్ట్ర నోడల్ అధికారి మల్లీశ్వరి, డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి అమానుల్లా, RWS అధికారి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించిన అధికారులు, గ్రామంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు.

స్థానికులతో మాట్లాడి పంచాయతీ పనితీరుపై వారి అభిప్రాయాలను అధికారులు ఆరా తీశారు. కొండాపురం గ్రామంలో నీటి వనరుల అభివృద్ధికి గతంలోనే ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టినట్లు గ్రామస్థులు వారికి వివరించారు. ఉపాధి హామీ, వాటర్షెడ్ పనుల్లో భాగంగా గ్రామ పెద్దల సహకారంతో వర్షపు నీటిని నిల్వచేసి భూగర్భ జలాలను పెంచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

ఈ క్రమంలో గ్రామ పరిసరాల్లో ఫార్మ్ పాండ్స్ , చెక్ డమ్స్ , మట్టి కట్టలు నిర్మించారు. ఈ పనుల ఫలితంగా గ్రామంలో నీటి నిల్వలు గణనీయంగా పెరిగాయని, దాదాపు 15 ఏళ్లుగా గ్రామంలో నీటి కొరత సమస్య ఎదురుకాలేదని స్థానికులు పేర్కొన్నారు.

నీటి సంరక్షణతో పాటు పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణకు కూడా కొండాపురం గ్రామం ప్రాధాన్యం ఇచ్చింది. పొగరహిత గ్రామం, మరుగుదొడ్ల వినియోగం, పరిశుభ్రత, పచ్చదనం వంటి అంశాల్లోనూ గ్రామపంచాయతీ అభివృద్ధి సాధించిందని అధికారులు గుర్తించారు. ఈ వివరాలన్నింటినీ పంచాయతీ కార్యదర్శి లోకేష్, పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ లో నమోదు చేయడంతో కేంద్ర ప్రభుత్వం గ్రామాన్ని గుర్తించి క్షేత్రస్థాయి పరిశీలనకు బృందాన్ని పంపింది.

పర్యటనలో భాగంగా అధికారులు ఫార్మ్ పాండ్స్ , ఇంకుడు గుంతలు, ఇతర నీటి సంరక్షణ నిర్మాణాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామంలో ప్రజలకు అందుతున్న సేవలపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్లు స్థానికులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో MPDO ధనుంజయనాథ్, ఉప MPDO రంగనాయకులు, పంచాయతీ కార్యదర్శులు లోకేష్, రంగనాథ్, నవీన్, ప్రకాష్, నాగార్జున, Swarnagram, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.