రాయలసీమ న్యూస్, అనంతపురం: అనంతపురం రూరల్ మండలంలోని రాప్తాడు ZPHS పాఠశాలలో ఇటీవల చోటుచేసుకున్న దారుణ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినులు గోపిక, లక్ష్మి త్వరగా కోలుకోవాలని బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది బీసీవీ శివరామకృష్ణ ఆకాంక్షించారు.
పాఠశాలలో చదువుతున్న గోపికపై ఆమె సమీప బంధువైన హేమంత్ అనే వ్యక్తి దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. మెరుగైన వైద్యం కోసం గోపికను బెంగళూరులోని Manipal ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడి సమయంలో తన స్నేహితురాలు గోపికను రక్షించేందుకు ప్రాణాలకు తెగించి ధైర్యసాహసాలు ప్రదర్శించిన లక్ష్మి కూడా తీవ్రంగా గాయపడింది. ఆమె అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఈ విషయం తెలుసుకున్న బీసీవీ శివరామకృష్ణ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి లక్ష్మిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. లక్ష్మికి ధైర్యం చెబుతూ, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తన స్నేహితురాలిని రక్షించేందుకు లక్ష్మి చూపిన తెగువ, మానవత్వం, సాహసాన్ని శివరామకృష్ణ అభినందించారు. బహుజన చైతన్య వేదిక తరఫున లక్ష్మికి ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించారు.
ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ, ఈ దారుణ ఘటనకు కారణమైన నిందితుడిని పోలీసులు పట్టుకోవడాన్ని అభినందించారు. అయితే ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా పాఠశాలల్లో విద్యార్థినుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

“తన స్నేహితురాలిని కాపాడేందుకు లక్ష్మి చూపిన ధైర్యం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. విద్యార్థినులు భయాందోళనల మధ్య చదువుకునే పరిస్థితి ఉండకూడదు. పాఠశాలలు విద్యార్థులకు భద్రత కల్పించే కేంద్రాలుగా ఉండాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, విద్యాశాఖ సమన్వయంతో కఠినమైన చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలి” అని శివరామకృష్ణ కోరారు.
ఈ కార్యక్రమంలో బహుజన చైతన్య వేదిక బృంద సభ్యులు రాంపురం రామాంజనేయులు, రంగేపల్లి కదిరప్ప, పెనుకొండ ఆండ్రస్, చల్లపల్లి తిప్పన్న, గౌరసిపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.













