రాయలసీమ న్యూస్, అనంతపురం:
విద్యార్థిని పై అమానుష దాడి: బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి సత్యకుమార్ భరోసా
అనంతపురం జిల్లా: అనంతపురం జిల్లా రాప్తాడులోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినులపై జరిగిన అమానుష దాడి ఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యాశాఖ మంత్రి, ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ తక్షణంగా స్పందించారు. పాఠశాల తరగతి గదిలోనే విద్యార్థినులపై రంపంతో దాడి చేయడం అత్యంత దారుణమని, ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేసినట్లు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

గాయపడిన విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందించి, వారు త్వరగా కోలుకునేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, చికిత్సలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని సూచించారు.

రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడి అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులు గోపిక, లక్ష్మిలను మంత్రి సత్యకుమార్ యాదవ్ స్వయంగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఇరువురి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న చికిత్స, ఆరోగ్య పరిస్థితిలో చోటుచేసుకుంటున్న మార్పులపై వైద్యులతో సమీక్ష నిర్వహించారు.

విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, చికిత్సలో ఎలాంటి లోపం లేకుండా అవసరమైన వైద్య సేవలు అందించాలని సంబంధిత వైద్యాధికారులకు మంత్రి స్పష్టం చేశారు. ఆస్పత్రి వాతావరణం, సదుపాయాలు, వైద్య సిబ్బంది అందుబాటు వంటి అంశాలపై కూడా ఆయన సమీక్షించినట్లు ప్రకటనలో వెల్లడించారు.

విద్యార్థిని గోపిక ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఆమెకు మరింత మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గోపికను అనంతపురం నుంచి బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. ఆమెను సురక్షితంగా, సాధ్యమైనంత వేగంగా బెంగళూరుకు చేర్చేందుకు ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులతో మంత్రి మాట్లాడి తగిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

అలాగే, బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రి యాజమాన్యంతో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడి, గోపికకు అత్యాధునిక వైద్య సదుపాయాలతో ప్రత్యేక చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఆమెకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల కుటుంబ సభ్యులకు మంత్రి ధైర్యం చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, వారి కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించే విషయంలో అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని ఆయన సూచించారు.

పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులపై ఇలాంటి దాడికి పాల్పడటం అత్యంత అమానుషమని మంత్రి సత్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు. విద్యార్థినులపై దాడికి పాల్పడిన నిందితుడిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థినుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

బాధిత విద్యార్థినుల ప్రాణాలను కాపాడేందుకు, వారికి అత్యుత్తమ వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వం పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గాయపడిన ఇరువురు విద్యార్థినులు త్వరగా కోలుకునేలా వైద్య సేవలను నిరంతరం పర్యవేక్షించాలని, వారికి అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యుల వారి కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది.













