అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ పాఠశాలలో విద్యార్థిని గోపికపై జరిగిన దారుణ దాడి కేసులో విచారణ కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎలక్ట్రిక్‌ రంపంతో గోపికపై దాడి చేసిన నిందితుడు హేమంత్‌ వ్యక్తిగత పరిస్థితులు, అతని గత ప్రవర్తనపై పోలీసులు సేకరిస్తున్న వివరాలు స్థానికులను కలచివేస్తున్నాయి.

గోపికకు వరసకు బాబాయైన హేమంత్‌ చిన్ననాటి నుంచే కుటుంబ సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. అతని తల్లిదండ్రులు చిన్నప్పుడే మృతి చెందడంతో కొంతకాలం అక్క సంరక్షణలో పెరిగాడు. అయితే హేమంత్‌ ప్రవర్తన నచ్చక అక్క అతన్ని ఇంటి నుంచి పంపించినట్లు సమాచారం. అనంతరం అతను అనంతపురం శివారులోని అద్దె గదిలో నివాసం ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.

హేమంత్‌ టమాటా మండీలో కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నప్పటికీ మద్యం, గంజాయికి బానిసైనట్లు దర్యాప్తులో బయటపడింది. గతంలో రాప్తాడు బీసీ బాలుర వసతిగృహానికి వెళ్లి అక్కడి విద్యార్థులపై దాడి చేసిన ఘటన కూడా అతని పేరుతో నమోదైందని స్థానికులు చెబుతున్నారు.

కొంతకాలంగా గోపికను పాఠశాలకు వెళ్లే సమయంలో హేమంత్‌ అనుసరిస్తున్నాడని ఆమె తోటి విద్యార్థినులు వెల్లడించినట్లు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన గోపిక తల్లిదండ్రులు గతంలోనే హేమంత్‌ను మందలించినట్టు తెలిసింది. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో చివరకు అతను పక్కా ప్రణాళికతో పాఠశాలలోకి చొరబడి దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

రాప్తాడు జడ్పీ పాఠశాలలో నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. మెటీరియల్‌తో కూలీలు ఆటోలో పాఠశాలకు వచ్చిన సమయంలో వారి వెనుకనే హేమంత్‌ కూడా లోపలికి ప్రవేశించినట్లు దర్యాప్తులో తేలింది. పనుల కోసం వచ్చిన కూలీగానే భావించిన పాఠశాల సిబ్బంది అతనిపై అనుమానం వ్యక్తం చేయలేదు.

ఉదయం సుమారు 10 గంటల సమయంలో హేమంత్‌ తరగతి గది వద్దకు వెళ్లి బయటే ఎలక్ట్రిక్‌ రంపాన్ని ఆన్‌ చేసినట్లు తెలుస్తోంది. చెట్ల కొమ్మలు కత్తిరిస్తున్నాడని భావించిన టీచర్‌ మొదట పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. టీచర్‌ ప్రశ్నించేలోపే హేమంత్‌ తరగతి గదిలోకి చొరబడి గోపికపై దాడి చేశాడు.

దాడి అనంతరం ఎలక్ట్రిక్‌ రంపాన్ని అక్కడే వదిలి హేమంత్‌ పరారయ్యాడు. ఈ ఘటనతో పాఠశాల పరిసరాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశారు. గోపికపై దాడి కేసును పూర్తి స్థాయిలో విచారించి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.