రాయలసీమ న్యూస్, అనంతపురం: అనంతపురం: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను వెలికితీసి, జిల్లా నుంచి రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి క్రికెటర్లను తీర్చిదిద్దడమే ఆర్డీటీ లక్ష్యమని ఆర్డీటీ క్రికెట్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. ఈ దిశగా ఆర్డీటీ డైరెక్టర్ మంచో ఫెర్రర్ చేస్తున్న కృషి జిల్లాకు వరమని ఆయన అభిప్రాయపడ్డారు.
అనంతపురం నగరంలోని అనంత క్రీడా మైదానంలో ఆర్డీటీ ఆధ్వర్యంలో రూరల్ క్రికెట్ టాలెంట్ హంట్ అండర్-18 రెండో దశ ఎంపిక కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉన్న అండర్-18 యువ క్రికెటర్లు ఈ ఎంపికల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా మచ్చా రామలింగారెడ్డి హాజరయ్యారు. సెలక్షన్ కమిటీ సభ్యులు ఇంతియాజ్, యోగానంద, వెంకటేష్, ఆర్డీటీ కోఆర్డినేటర్ ప్రవీణ్, ఆర్డీటీ క్రికెట్ కోచ్లు రఫీ, హరినాథ్ రెడ్డి, విజయరాజు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో క్రికెట్ అభివృద్ధి కోసం ఆర్డీటీ చేస్తున్న కృషిని మచ్చా రామలింగారెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియాన్ని నిర్మించి, క్రికెట్ రంగంలో అనంతపురం జిల్లాకు ప్రత్యేక స్థానం తీసుకురావడంలో ఆర్డీటీ కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి క్రికెటర్లను తయారు చేయడంలో ఆర్డీటీ పాత్ర ఎనలేనిదని ఆయన అన్నారు.
క్రికెట్ టాలెంట్ హంట్ అన్వేషణలో భాగంగా సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉన్న యువ క్రికెటర్లు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని మచ్చా రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. 18 సంవత్సరాల లోపు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.
ఇప్పటికే అండర్-15, అండర్-12 విభాగాల్లో ఉమ్మడి జిల్లాలో దాదాపు 600 మందికి పైగా యువ క్రికెటర్ల ప్రతిభను పరిశీలించినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం అండర్-18 విభాగంలో సత్యసాయి, అనంతపురం జిల్లాల యువ క్రికెటర్ల ప్రతిభను పరిశీలించి, మూడో దశ ఎంపికలకు అర్హులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు.

మూడుదశల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక, ప్రతి గ్రూపులో ప్రతిభ కనబరిచిన యువ క్రికెటర్లను ఎంపిక చేసి, వారికి ప్రత్యేక శిక్షణ అందించి రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి క్రికెటర్లుగా తీర్చిదిద్దడమే ఆర్డీటీ లక్ష్యమని మచ్చా రామలింగారెడ్డి చెప్పారు.
సమావేశం అనంతరం సత్యసాయి జిల్లా అండర్-18 యువ క్రికెటర్లను కమిటీ సభ్యులు మచ్చా రామలింగారెడ్డికి పరిచయం చేశారు. అనంతరం ఆయన చేతుల మీదుగా ఎంపిక పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.













