బెంగళూరు,: రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆరోగ్య పరిస్థితిని ఆంధ్రప్రదేశ్‌ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ గురువారం బెంగళూరులో స్వయంగా వెళ్లి తెలుసుకున్నారు. ఓల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ రోడ్డులో ఉన్న మణిపాల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఆయన పరామర్శించారు.

బాలికకు అందుతున్న చికిత్స, ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులతో నారా లోకేశ్‌ సుదీర్ఘంగా చర్చించారు. అవసరమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేశామని, ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు మంత్రికి వివరించారు. రక్తమార్పిడి సహా ఇతర సహాయక చికిత్సల ద్వారా పరిస్థితిని స్థిరీకరించామని, ప్రధాన రక్తస్రావాన్ని నియంత్రించగలిగామని వైద్య బృందం తెలియజేసింది.

అయితే రాబోయే 48 గంటలు అత్యంత కీలకమని వైద్యులు వివరించడంతో, ఆ కాలంలో బాలిక ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని నారా లోకేశ్‌ సూచించారు. అనంతరం పీడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌కు వెళ్లి చికిత్స పొందుతున్న చిన్నారిని పరిశీలించారు. చిన్నారిని తమ బిడ్డలా భావించి మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. బాలిక ప్రాణాలను కాపాడేందుకు కృషి చేస్తున్న వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపారు.

తరువాత బాలిక తల్లిదండ్రులను పరామర్శించిన నారా లోకేశ్‌ వారికి ధైర్యం చెప్పారు. బాలిక తండ్రికి తన వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌ను అందజేశారు. ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా ఫోన్‌ చేయవచ్చని, సందేశం పంపవచ్చని భరోసా ఇచ్చారు. టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఆ కుటుంబానికి అండగా ఉంటానని, అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.

ఘటన జరిగిన తీరును స్కూల్‌ ప్రిన్సిపాల్‌ను అడిగి నారా లోకేశ్‌ వివరాలు తెలుసుకున్నారు. బాలికపై దాడికి పాల్పడిన వ్యక్తిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థిని సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి రావాలని ఆకాంక్షించారు.

ఈ పర్యటనలో ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి, మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ రాయపాటి శైలజ, విద్యాశాఖ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా తదితరులు నారా లోకేశ్‌కు తోడుగా ఉన్నారు.