రాయలసీమ న్యూస్, అనంతపురం: రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం జరిగిన దాడి ఘటనతో అక్కడ తీవ్ర కలకలం రేగింది. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని గోపిక లక్ష్మిపై ఓ వ్యక్తి చెక్క మొద్దులు కోసే మిషన్తో దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.

పోలీసులు, స్థానికుల ప్రాథమిక సమాచారం ప్రకారం, దుండగుడు పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించి గోపిక లక్ష్మిపై ఆకస్మికంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఘటన సమయంలో పాఠశాలలో తరగతులు కొనసాగుతుండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు.
పాఠశాల సమయాల్లోనే విద్యార్థినిపై దాడి జరగడం తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాఠశాల ప్రాంగణంలో అకస్మాత్తుగా జరిగిన ఈ దాడి కారణంగా అక్కడ కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు వివరించినట్లు సమాచారం.

రాప్తాడు ఘటన అనంతరం నిందితుడిని ధర్మవరంలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నిందితుడు బాలిక మేనమామగా అనుమానం వ్యక్తమవుతోంది. అతని స్వస్థలం ధర్మవరం మండలం నాగలూరు కాగా, అయ్యవారిపల్లెలో అక్క దగ్గరే ఉంటున్నాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్న ఉన్మాది ఈ దాడికి పాల్పడిన అవకాశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుడి నేపథ్యం, బాలిక కుటుంబంతో సంబంధాలు, గతంలో జరిగిన వేధింపుల వివరాలపై కూడా దర్యాప్తు సాగుతోంది.
ఘటన అనంతరం పాఠశాల పరిసరాల్లో భద్రతను పెంచినట్లు, మరిన్ని ఇలాంటి ఘటనలు జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు సూచిస్తున్నాయి. విద్యార్థుల భద్రతకు సంబంధించి పాఠశాలల్లో అదనపు చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.













