ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ మేరకు హైకోర్టు విధించిన నిబంధనలను సడలించాలని సిట్ కోరింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం, సీఐ నాగరాజును ఒక రోజు మాత్రమే కృష్ణలంకలో విచారించేందుకు అనుమతిస్తూ, మిగిలిన ఏడు రోజుల విచారణను రాజమండ్రి సెంట్రల్ జైలులోనే నిర్వహించాలని పేర్కొంది. అలాగే విచారణ మొత్తం ఆడియో, వీడియో రికార్డింగ్‌తో జరగాలని ఆదేశించింది.

అయితే ఈ పరిమితుల వల్ల కేసుకు సంబంధించిన పూర్తి వాస్తవాలను వెలికితీయడం కష్టమవుతోందని సిట్ వాదిస్తోంది. అందువల్ల సమగ్ర దర్యాప్తు కోసం హైకోర్టు విధించిన షరతులను సవరించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసులో దర్యాప్తు పురోగతి వివరాలతో స్టేటస్‌ రిపోర్ట్‌ను సీల్డ్‌ కవర్‌లో తమకు ఇవ్వాలంటూ బుధవారం రోజు సిట్‌ను ఆదేశించింది హైకోర్టు.. ఈ కేసులో తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.