అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇంస్టాగ్రామ్ ద్వారా కొనసాగుతున్న ప్రేమ వ్యవహారం నేపథ్యంగా ఓ బీహార్ యువకుడిపై అమానుష దాడి జరిగిన ఘటన ఆదివారం ఉదయం వెలుగు చూసి కలకలం రేపుతోంది. అమ్మాయి తరఫు బంధువులు యువకున్ని అడవి ప్రాంతానికి తీసుకెళ్లి ప్లంబర్ పైపులతో విచక్షణారహితంగా కొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారని బాధితుడు, పోలీసులు వెల్లడించారు.

పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం మదనపల్లి మండలం సీటీఎం ప్రాంతంలోని ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్న బీహార్ యువకుడు ముకేశ్ (20) మదనపల్లెలోని శ్రీనివాస సిమెంట్ అంగడిలో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న ముకేశ్ వద్దకు అమ్మాయి తరఫు బంధువులుగా గుర్తించిన ఐదుగురు వ్యక్తులు వచ్చారు. మాట్లాడాల్సిన పని ఉందని చెప్పి ఊరికి సమీపంలో ఉన్న అడవి ప్రాంతానికి అతన్ని తీసుకెళ్లారు.

అక్కడ ముకేశ్‌ను ప్లంబర్ పైపులతో దాదాపు నాలుగున్నర గంటల పాటు, తెల్లవారుజాము 1 గంట వరకు ఏకధాటిగా కొట్టినట్లు సమాచారం. అనంతరం తీవ్ర గాయాలతో ఉన్న అతన్ని తిరిగి తీసుకొచ్చి సీటీఎం ప్రాంతంలోని అతని గదిలో పడేసి వెళ్లిపోయారు. అదే గదిలో మరికొంతమంది బీహార్ యువకులు కూడా ఉంటుండడంతో, వారు ముకేశ్ పరిస్థితిని గమనించి సహచరులకు సమాచారం అందించారు.

సహచరులు వెంటనే ముకేశ్‌ను స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి అవసరమైన చికిత్స అందించారు. ప్రస్తుతం ముకేశ్ కోలుకుంటూ ఉన్నాడని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఇంస్టాగ్రామ్‌లో ప్రేమ సంబంధం కొనసాగిస్తున్నాడనే కోపంతో ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక విచారణలో బయటపడుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై తాలూకా సిఐ కళా వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడిలో పాల్గొన్న వ్యక్తుల గుర్తింపు, అరెస్టు, దాడి వెనుక ఉన్న పూర్తి నేపథ్యంపై విచారణ కొనసాగుతోంది.

మదనపల్లి ప్రాంతంలో యువకుడిపై జరిగిన ఈ అమానుష దాడి స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. ప్రేమ వ్యవహారాల పేరుతో ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితుని ఆరోగ్య పరిస్థితి, కేసు దర్యాప్తు పురోగతిపై పోలీసులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.