రాయలసీమ న్యూస్, అన్నమయ్య: మదనపల్లె: భారత మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా మదనపల్లె దొంతివీధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎస్. రెడ్డీ సాహెబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమం ప్రారంభంలో కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకున్నారు. దేశ రాజకీయ, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో రాజీవ్ గాంధీ చేసిన మార్పులు, సంస్కరణలను నాయకులు ప్రస్తావించారు.
ఈ సందర్భంగా ఎస్. రెడ్డీ సాహెబ్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ జయంతిని దేశవ్యాప్తంగా సద్భావనా దివస్‌గా నిర్వహిస్తున్నారని తెలిపారు. దేశంలో శాంతి, మత సామరస్యం, జాతీయ ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించడమే సద్భావనా దివస్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. దేశంలో టెలికాం విప్లవానికి, కంప్యూటరీకరణకు పునాదులు వేసిన నాయకుడు రాజీవ్ గాంధీ అని గుర్తుచేశారు. 18 ఏళ్ల వయస్సు నుంచే యువతకు ఓటు హక్కు కల్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని వివరించారు.
కాంగ్రెస్ పాలనలో దేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధించిందని ఎస్. రెడ్డీ సాహెబ్ తెలిపారు. పంచవర్ష ప్రణాళికల ద్వారా భారీ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించడంతో పాటు హరిత విప్లవం ద్వారా ఆహార ఉత్పత్తిలో దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లారని చెప్పారు. ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి ప్రతిష్ఠాత్మక విద్యా, వైద్య సంస్థల స్థాపన ద్వారా దేశ మానవ వనరుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వాలు కృషి చేశాయని పేర్కొన్నారు.
1991లో అప్పటి ప్రధాని పి.వి. నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ నాయకత్వంలో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను ప్రవేశపెట్టి భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని ఎస్. రెడ్డీ సాహెబ్ అన్నారు. పేదరిక నిర్మూలనకు గరీబీ హఠావో, గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆహార భద్రత చట్టం, విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం వంటి పలు కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేశాయని వివరించారు.
ఇదే కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బి. శరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాజేష్, విజయ్ కుమార్, ప్రదీప్, సంతోష్, హార్తిక్, మౌర్య, మమ్ము, అరుణ్ కుమార్, మంజునాథ్, కార్తీక్, గౌరీష్, భాను ప్రకాష్, అనిల్ కుమార్ తదితర పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎస్. రెడ్డీ సాహెబ్, బి. శరత్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
యువత కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని ఎస్. రెడ్డీ సాహెబ్ పిలుపునిచ్చారు. బీజేపీ విధానాలు, మతపరమైన రాజకీయాలు సమాజంలో విభేదాలకు దారితీస్తున్నాయని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశంలో కీలక మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శరత్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ షరీఫ్, విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి బి. ఈశ్వరయ్య, మదనపల్లె పట్టణ మైనార్టీ అధ్యక్షుడు మహబూబ్ పీర్, మదనపల్లె మండల మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అలీ, మాజీ బీసీ అధ్యక్షుడు నాగరాజు, మాజీ ఎస్సీఎల్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర, పట్టణ మహిళా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, నాయకులు హబీబ్ ఖాన్, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, నూతనంగా పార్టీలో చేరిన యువత పాల్గొన్నారు.













