రాయచోటి: విశాఖపట్నంలో రెండు రోజులపాటు నిర్వహించిన BRICS యువజన మరియు క్రీడా మంత్రుల సమావేశంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. భారత్‌ BRICS అధ్యక్షతలో జరిగిన ఈ సదస్సులో యువత, క్రీడల అభివృద్ధి, సాంకేతికత, స్టార్టప్‌లు, క్రీడా మౌలిక వసతులు, అంతర్జాతీయ సహకారం తదితర అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి.

ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి యువత, క్రీడల రంగాల్లో చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించారు. యువతను ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగాలు సృష్టించే యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నైపుణ్యాభివృద్ధి, డిజిటల్‌ విద్య, స్టార్టప్‌ ప్రోత్సాహక కార్యక్రమాలను విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రీడల్లో ఆధునిక సాంకేతికత వినియోగం, స్పోర్ట్స్‌ సైన్స్‌, డేటా అనలిటిక్స్‌, ఆధునిక శిక్షణా విధానాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

BRICS దేశాల మధ్య యువజన మార్పిడి, క్రీడా సాంకేతికత, క్రీడా మౌలిక వసతులు, స్పోర్ట్స్‌ టూరిజం రంగాల్లో పరస్పర సహకారం పెంచుకోవాల్సిన అవసరాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రస్తావించారు. ఈ రంగాల్లో కలిసి పనిచేస్తే సభ్య దేశాల యువతకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.

సదస్సులో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డా. మన్సుఖ్ మాండవీయ, కేంద్ర సహాయ మంత్రి శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే, BRICS దేశాల మంత్రులు, ఉపమంత్రులు, ఉన్నతాధికారులు, ప్రతినిధులతో పాటు విశాఖపట్నం జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా వీరభద్రాంజనేయ స్వామి, హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నంలో జరిగిన BRICS సదస్సు ద్వారా యువత, క్రీడల రంగాల్లో అంతర్జాతీయ సహకారానికి మరింత బలమైన పునాది ఏర్పడిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ వేదిక ద్వారా సభ్య దేశాల మధ్య అనుభవాల మార్పిడి, సంయుక్త కార్యక్రమాల రూపకల్పనకు అవకాశం కలిగిందని ఆయన పేర్కొన్నారు.