రాయలసీమ న్యూస్, అన్నమయ్య: రాజంపేట: సమాజంలో వాస్తవాలను నిర్భయంగా వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఎంతమాత్రం సహించేది లేదని ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) నాయకులు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై వార్తా కథనాన్ని రాసినందుకు గాను, విశాలాంధ్ర విలేకరి గోవిందుపై జరిగిన భౌతిక దాడిని యూనియన్ తీవ్రంగా ఖండించింది.
ఈ ఘటనకు నిరసనగా కడప జిల్లా రాజంపేటలోని Sub కలెక్టర్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
నిరసన కార్యక్రమం అనంతరం Sub Collector కార్యాలయ పరిపాలనాధికారి (AO)కి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జర్నలిస్టులు అందజేశారు. విలేకరి గోవిందుపై దాడికి తెగబడిన నిందితులను వెంటనే గుర్తించి, వారిని అరెస్ట్ చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు.
ప్రజాక్షేత్రంలో నిరంతరం ఉంటూ విధులు నిర్వహించే జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని APUWJ నాయకులు పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే సమయంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ముప్పును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని వారు అభిప్రాయపడ్డారు.
జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాద సంకేతమని, ఇలాంటి ఘటనలను అడ్డుకునేందుకు కఠిన చట్టపరమైన చర్యలు తప్పనిసరి అని యూనియన్ నాయకత్వం స్పష్టం చేసింది. జర్నలిస్టుల భద్రతను నిర్ధారించేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలని, దాడులకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరాదని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.













