రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: యంగ్ ఇండియన్స్ (Yi) అమరావతి సీడ్ బాల్స్ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈనెల 29న విజయవాడలోని పీవీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రాంగణంలో సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించి యంగ్ ఇండియన్స్ (Yi) అమరావతి చాప్టర్ ప్రతినిధులు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆహ్వానించారు. కాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు వివరించారు. ఒకే రోజు, ఒకే వేదికపై 75 వేలకుపైగా సీడ్ బాల్స్ తయారు చేసి రికార్డు సాధించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినట్లు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం విస్తరణ, యువతలో సామాజిక బాధ్యతాభావాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని Yi అమరావతి చాప్టర్ ప్రతినిధులు పేర్కొన్నారు. సీడ్ బాల్స్ తయారీ ద్వారా నగర పరిసర ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమానికి సంబంధించి CII చైర్మన్ నరేంద్ర కుమార్ కూడా మంత్రికి ఆహ్వానం పలికినట్లు ప్రతినిధులు తెలిపారు. యంగ్ ఇండియన్స్ (Yi) అమరావతి చాప్టర్, CIIతో కలిసి ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తోంది. విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
పీవీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రాంగణంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం ద్వారా విజయవాడ నగరాన్ని పచ్చదనంతో నింపే దిశగా తొలి అడుగు వేస్తున్నామని Yi ప్రతినిధులు పేర్కొన్నారు. సీడ్ బాల్స్ తయారీ అనంతరం వాటిని నగర పరిసర ప్రాంతాల్లో, ఖాళీ భూముల్లో, పాదయాత్ర మార్గాల వెంట విస్తరించే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నట్లు తెలిపారు.













