రాయలసీమ న్యూస్, అన్నమయ్య: రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో పల్లకి సేవ, ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
స్థానిక భక్తులతో పాటు కర్ణాటక రాష్ట్రం నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరభద్ర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, నైవేద్యాలు నిర్వహించగా, ఆలయ వాతావరణం మంత్రోచ్ఛారణలతో, మంగళ ధ్వనులతో మార్మోగింది.
వీరభద్రుని పూజలు అనంతరం మంగళ వాయిద్యాలు, మేళతాళాల మధ్య భక్తులు పల్లకిని మాద వీధుల్లో ఊరేగించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ పల్లకి సేవను చూసేందుకు ప్రజలు ఇళ్ల ముందుకు వచ్చి దర్శనం పొందారు. పల్లకి ఊరేగింపు సమయంలో భక్తులు జయజయధ్వానాలు చేస్తూ, స్వామి నామస్మరణలో మునిగిపోయారు.
దేవస్థానం అర్చకులు భక్తుల పేర్లు, గోత్రాలు నమోదు చేసి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు స్వామికి మొక్కులు పెట్టుకుని, అర్చనల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్, దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి డి.వి. రమణారెడ్డి పల్లకి సేవ, పూజా కార్యక్రమాల నిర్వహణపై పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది, సేవాదళం ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు.
పల్లకి సేవ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తుల రాకపోకల కారణంగా రద్దీ పెరగడంతో, స్థానిక పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాయచోటి పట్టణంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ పల్లకి సేవకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉండటంతో, భక్తులు దూరదూర ప్రాంతాల నుండి విచ్చేసి స్వామి దర్శనం, సేవలో పాల్గొంటున్నారు.













