మదనపల్లె: మదనపల్లె ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చిప్పిలి, గుట్టకాడపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది నాటి తెలుగు దేశం పార్టీ ప్రభుత్వమేనని TDP సీనియర్ నాయకుడు ఆర్‌జే వెంకటేష్ పేర్కొన్నారు. 2019–2024 మధ్య అధికారంలో ఉన్న YSRCP ప్రభుత్వం ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆయన ఆరోపించారు.

శనివారం నిమ్మన పల్లె సర్కిల్‌లోని TDP కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్‌జే వెంకటేష్‌తో పాటు శివకృష్ణ, రాజన్న, లోకేష్, రాంబాబు, ప్రకాష్, మల్లికార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం, ప్రాజెక్టు పురోగతి, ప్రభుత్వాల వైఖరిపై ఆయన విమర్శలు గుప్పించారు.

ఆర్‌జే వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం, 2006లోనే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం కోసం రూ.20 కోట్లు విడుదలయ్యాయి. అప్పట్లో ఈ ప్రాజెక్టులో కేవలం స్పిల్ వే పనులు మాత్రమే పెండింగ్‌లో ఉండగా, అనంతరం వచ్చిన ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుపై తగిన శ్రద్ధ చూపలేదని ఆయన విమర్శించారు.

2019–2024 మధ్య అధికారంలో ఉన్న YSRCP ప్రభుత్వం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కోసం ఎంత నిధులు ఖర్చు చేసిందో స్థానిక నాయకుడు నిస్సార్ అహ్మద్ ప్రజలకు స్పష్టంగా వివరించాలని ఆర్‌జే వెంకటేష్ ప్రశ్నించారు. ప్రాజెక్టు పనులు పూర్తికాకముందే పైప్‌లైన్ పనులు ప్రారంభించి, మొబిలైజషన్ అడ్వాన్స్ పేరుతో భారీగా ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. కేవలం పైప్‌లైన్ పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి, ప్రధాన ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.

MP నిధులతో చిప్పిలికి నీరు అందేలా చర్యలు తీసుకోవాల్సిన సమయంలో, నీటి సరఫరా జరిగేలా కాకుండా కేవలం రిటైనింగ్ వాల్ మాత్రమే నిర్మించారని ఆర్‌జే వెంకటేష్ పేర్కొన్నారు. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిండిన సమయంలో బ్యాక్ వాటర్ వ్యవసాయ భూముల్లోకి చేరకుండా ఉండేందుకు మరవలు తెగ్గొట్టిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని ఆయన ఆరోపించారు.

వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని నిస్సార్ అహ్మద్ కు ఆర్‌జే వెంకటేష్ హితవు పలికారు. DSC, APPSC మధ్య తేడా కూడా తెలియని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్రానికి దురదృష్టకరమని ఆయన ఎద్దేవా చేశారు. ఇకనైనా ఏ అంశంపైనైనా మాట్లాడే ముందు వాస్తవాలు, ప్రాజెక్టుల వివరాలు పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు.

రెండు లక్షల జనాభా కలిగిన మదనపల్లె ప్రజల దాహార్తిని తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులను త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని ఆర్‌జే వెంకటేష్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి అయితే మదనపల్లె పరిసర ప్రాంతాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.