చిత్తూరు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా శక్తి టీమ్స్ తో స్త్రీలు, బాలికలు, పిల్లల భద్రత, రక్షణ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో మహిళలు, పిల్లలపై నేరాలను అరికట్టడం, వారికి అందుబాటులో ఉన్న రక్షణ, సహాయ సేవలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది.

సమావేశంలో శక్తి టీమ్స్ ను మైదాన స్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని పోలీసు అధికారులు సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, స్త్రీలు, బాలికలు, పిల్లలకు ఎదురయ్యే ప్రమాదాలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా ప్రజల్లో చైతన్యం కల్పించాలని ఆదేశించారు.

శక్తి అప్ వినియోగం, SOS సౌకర్యాలపై ప్రజలకు విస్తృత ప్రచారం చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో ఈ సేవలు ఎలా ఉపయోగపడతాయో మహిళలకు, యువతకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. శక్తి అప్ ద్వారా అందుబాటులో ఉన్న సేవలను ప్రతి కుటుంబానికి చేరవేయాలనే లక్ష్యంతో టీమ్‌లు పనిచేయాలని అధికారులు పేర్కొన్నారు.

జిల్లాలో కనిపించకుండా పోయిన మహిళలు, బాలికలు, పిల్లల కేసులు, ఎలోపెమేంట్ కేసులను వేగంగా పరిష్కరించేందుకు శక్తి టీమ్స్ సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇలాంటి కేసుల్లో కుటుంబాలకు, బాధితులకు తక్షణ సహాయం అందిస్తూ, చట్టపరమైన చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.

స్త్రీలపై జరిగే నేరాలను ముందస్తు చర్యల ద్వారా నివారించేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని, గృహ హింస, వేధింపులు, దాడులు వంటి ఘటనలను గుర్తించి, బాధితులకు తక్షణ రక్షణ కల్పించాలని శక్తి టీమ్స్ కు సూచించారు. మహిళల భద్రతకు సంబంధించిన ప్రతి సమాచారం, ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యంతో తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

సైబర్ మోసాలు, డ్రగ్స్ వినియోగం, చైల్డ్ సేఫ్టీ అంశాలపై కూడా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. సోషల్ మీడియా, మొబైల్ వినియోగం, ఆన్‌లైన్ లావాదేవీల సమయంలో జాగ్రత్తలు, పిల్లలపై ఆన్‌లైన్‌లో ఉన్న ప్రమాదాల గురించి తల్లిదండ్రులకు, విద్యార్థులకు వివరించాలని శక్తి టీమ్స్ ను ఆదేశించారు.

జిల్లాలో అందుబాటులో ఉన్న హెల్ప్ లైన్స్ , పోలీసు సహాయ కేంద్రాలు, మహిళల కోసం ప్రత్యేక సేవల వివరాలను ప్రజలకు తెలియజేస్తూ, అవసరమైనప్పుడు వెంటనే సంప్రదించేందుకు ప్రోత్సహించాలని అధికారులు సూచించారు. ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో శక్తి టీమ్స్, పోలీసు వ్యవస్థ మధ్య సమన్వయాన్ని పెంచి, స్త్రీలు, పిల్లల భద్రతను మరింత బలోపేతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

Together for a Safer Chittoor – Women & Child Safety is Our Priority.