ఆన్‌లైన్ గేమ్స్ వద్దన్నందుకు మామను చంపిన అల్లుడు!

చిత్తూరు: ఆన్‌లైన్ గేమ్స్ వద్దన్నందుకు మామను దారుణంగా హత్య చేసిన అల్లుడు

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రంగంపేట ఎస్టీ కాలనీలో ఘోర కలియుగం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గేమ్స్ ఆడవద్దని మందలించినందుకు ఓ అల్లుడు తన మామను దారుణంగా చంపేసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

మృతుడి కుమార్తె తెలిపిన వివరాల ప్రకారం... రంగంపేట ఎస్టీ కాలనీకి చెందిన అశోక్ అనే యువకుడు గత కొంతకాలంగా ఆన్‌లైన్ గేమ్స్‌కు తీవ్రంగా బానిసయ్యాడు. నిత్యం ఫోన్‌లో గేమ్స్ ఆడుతూ విపరీతంగా అప్పులపాలయ్యాడు. ఈ విషయమై ఇంట్లో నిత్యం గొడవలు జరిగేవి. అశోక్ తన భార్య అక్కతో కూడా తరచూ గొడవ పడుతుండేవాడు.

ఈ క్రమంలో అశోక్ మామ సుబ్రహ్మణ్యం అల్లుడి ప్రవర్తనను ప్రశ్నించారు. "ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ జీవితాన్ని ఎందుకు పాడుచేసుకుంటున్నావ్? అప్పులు ఎందుకు చేస్తున్నావ్?" అని గట్టిగా మందలించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన అశోక్, మద్యం మత్తులో విచక్షణ కోల్పోయాడు. తనను ప్రశ్నించిన మామ సుబ్రహ్మణ్యంపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా కొట్టడంతో సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఆన్‌లైన్ గేమ్‌ల వల్లే తన భర్త అప్పులపాలయ్యాడని, మందలించినందుకు తన తండ్రిని దారుణంగా చంపేశాడంటూ మృతుడి కుమార్తె కన్నీరుమున్నీరుగా విలపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.