రాయలసీమ న్యూస్, చిత్తూరు: చిత్తూరు నగరంలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న కమర్షియల్ సేల్స్ ట్యాక్స్ జిల్లా ఆఫీస్‌ను తిరుపతికి తరలించే ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ తరలింపును నిరసిస్తూ మంగళవారం ఉదయం కట్టమంచిలోని జిల్లా కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం వద్ద వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.
ఆందోళన సందర్భంగా వైసీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానంద రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చిత్తూరు నుంచి ప్రభుత్వ కార్యాలయాలను తరలించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అడ్డుకుంటానని గతంలో చెప్పిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రస్తుతం ఈ అంశంపై స్పందించకుండా ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు.
అభివృద్ధి పేరుతో చిత్తూరు నగరంలో ఉన్న జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించడం సరైన నిర్ణయం కాదని విజయానంద రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన కార్యాలయాలను ఒక్కసారిగా మరో నగరానికి మార్చడం వల్ల స్థానిక వ్యాపార వర్గాలు, పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.
చిత్తూరులో ఉన్న కమర్షియల్ ట్యాక్స్ జిల్లా ఆఫీస్‌ను తిరుపతికి తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
ప్రభుత్వం ఈ తరలింపు నిర్ణయాన్ని కొనసాగిస్తే వైసీపీ ఆధ్వర్యంలో ఇతర రాజకీయ పక్షాలను, ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని విజయానంద రెడ్డి హెచ్చరించారు. చిత్తూరు ప్రజల హక్కుల కోసం పార్టీ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
కమర్షియల్ ట్యాక్స్ జిల్లా కార్యాలయం తరలింపు అంశంపై స్థానిక వ్యాపార వర్గాలు, పన్ను సలహాదారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వైసీపీ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం చిత్తూరులో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.













